online: ఆన్లైన్లో స్టీఫెన్ హాకింగ్ సిద్ధాంత వ్యాసం... వెల్లడించిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం
- అపోలో పోర్టల్లో అందుబాటులో ఉంచిన కేంబ్రిడ్జి
- `ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పాండింగ్ యూనివర్సెస్` పేరుతో సిద్ధాంత వ్యాసం రాసిన హాకింగ్
- భావిశాస్త్రవేత్తలకు ఆదర్శంగా ఉంటుందని వ్యాఖ్య
1965లో 24 ఏళ్ల వయసులో ఉన్నపుడు శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ రాసిన సిద్ధాంత వ్యాసాన్ని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ఆన్లైన్లో పెట్టింది. `ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పాండింగ్ యూనివర్సెస్` పేరుతో ఉన్న ఈ సిద్ధాంత వ్యాసాన్ని కేంబ్రిడ్జి ఓపెన్ యాక్సెస్ రెపొజిటరీ అపోలో వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది. భావిశాస్త్రవేత్తలకు ఆదర్శంగా ఉండేందుకు ఈ సిద్ధాంత వ్యాసాన్ని అందరికీ అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.
దీని గురించి స్టీఫెన్ హాకింగ్ స్పందనను కూడా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. `నా పీహెచ్డీ సిద్ధాంత వ్యాసాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం వల్ల ప్రపంచమంతా తమ కాళ్ల వైపుకి కాకుండా ఆకాశం వైపు చూసేందుకు అవకాశం కలుగుతుందని నేను భావిస్తున్నాను. విశ్వంతరాలను అర్థం చేసుకునే అవకాశం ఏర్పడుతుందని అనుకుంటున్నాను` అని స్టీఫెన్ హాకింగ్ చెప్పినట్లుగా విశ్వవిద్యాలయం వెల్లడించింది.
శాస్త్రవేత్తలు తమ ముందు తరాల వారి పరిశోధనల ఆధారంగా మరిన్ని పరిశోధనలు కొనసాగించడం సాధారణంగా జరుగుతూనే ఉంటుందని, తాను కూడా న్యూటన్, క్లార్క్ మాక్స్వెల్, ఐన్స్టీన్ పరిశోధనల మీద ఆధారపడే సిద్ధాంత వ్యాసం తయారు చేసినట్లు హాకింగ్ అన్నారు.