america: అమెరికా-మెక్సికో మధ్య గోడకు నమూనాలు సిద్ధం... గోడ ప్రత్యేకతలివే!
- అమెరికా-మెక్సికో మధ్య గోడ కోసం 8 నమూనాలు సిద్ధం చేసిన ప్రభుత్వం
- ట్రంప్ వాటిని పరిశీలించి, మోడల్ ఎంపిక చేయగానే పనులు ప్రారంభం
- 3,146 కిలోమీటర్ల సరిహద్దు గుండా గోడ నిర్మాణం
- ఎన్నికల హామీ నెరవేర్చనున్న ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ‘‘మెక్సికన్లు రేపిస్టులు.. నేరస్తులు.. డ్రగ్ డీలర్లు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనను అధ్యక్షుడ్ని చేస్తే మెక్సికన్లు అమెరికాలోకి రాకుండా గోడకడతానని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో తానిచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు.
ఈ మేరకు గోడకు సంబంధించిన ఎనిమిది నమూనాలు సిద్ధం చేశారు. దక్షిణ కాలిఫోర్నియాలోని శాండియాగో, టిజువానా (మెక్సికో) సరిహద్దుల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఈ నమూనాల తయారీలో కాంక్రీట్, లోహాన్ని వాడారు. ఒక్కో నమూనా 9 మీటర్ల వెడల్పుతో 18 నుంచి 30 మీటర్ల ఎత్తు ఉండేలా నిర్మించారు. ఈ గోడపై భాగాన పదునైన కొక్కీలను ఏర్పాటు చేశారు.
ఒక్కో నమూనా తయారీకి 5 లక్షల డాలర్లను ఖర్చుచేసినట్టు తెలుస్తోంది. ఈ ఎనిమిది నమూనాల్లో ఏదో ఒక నమూనాపై ట్రంప్ ఆమోదముద్ర వేస్తే దానిని నిర్మాణంలో వినియోగించనున్నారు. అమెరికా-మెక్సికో సరిహద్దు పొడవు 3,146 కిలోమీటర్లు ఉండగా, ఈ సరిహద్దుల్లో ఇప్పటికే 1,052 కిలోమీటర్ల మేర ఒక వరుస కంచె ఉంది. మరో 82 కిలోమీటర్ల మేర రెండు, మూడు వరుసల కంచె ఉంది. ఈ మొత్తం సరిహద్దు వెంబడి ఎత్తైన గోడ కట్టేసి దానిని మూసెయ్యాలని ట్రంప్ భావిస్తున్నారు. ఆ విధంగా 18 మీటర్ల నుంచి 30 మీటర్లు ఎత్తున్న సరిహద్దు గోడ నిర్మించాలంటే సుమారు రూ. 65,000 కోట్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. కేవలం గోడ నిర్మాణంతో ఆపెయ్యకుండా 10 వేల మందితో బోర్డర్ సెక్యూరిటీ పెట్రోలింగ్ సిబ్బందిని కూడా విధుల్లోకి తీసుకోనున్నారని తెలుస్తోంది.