Tajmahal: వివాదాల నడుమ తాజ్‌ను సందర్శించనున్న యూపీ సీఎం.. చీపురు పట్టి తాజ్ పరిసరాలను శుభ్రం చేయనున్న యోగి!
- 17వ శతాబ్దంనాటి కట్టడం చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు
- ఈనెల 26 యోగి తాజ్ సందర్శన
- మెగా క్లీనింగ్ కార్యక్రమంలో చీపురు పట్టనున్న సీఎం
అద్భుత కట్టడం తాజ్‌మహల్ చుట్టూ వివాదాలు అలముకున్న వేళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి తాజ్‌ను సందర్శించనున్నారు. ఈ నెల 26 తాజ్‌మహల్‌ను సందర్శించనున్న ఆయన 500 మంది బీజేపీ కార్యకర్తలతో కలిసి తాజ్ పరిసరాలను శుభ్రం చేయనున్నారు. తాజ్‌మహల్ లోపల అరగంట గడిపిన అనంతరం షాజహాన్ పార్క్‌ను సందర్శించి షాజహాన్, ముంతాజ్ సమాధులను సందర్శిస్తారు.
ముఖ్యమంత్రి తన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ దయాళ్ తెలిపారు. అలాగే ఆగ్రా-తాజ్‌మహల్ నడకదారికి శంకుస్థాపన చేయనున్నట్టు పేర్కొన్నారు. 500 మంది పార్టీ కార్యకర్తలు, పారిశ్రామికవేత్తలు, టీచర్లు, డాక్టర్లు, సోషల్ వర్కర్లతో కలిసి తాజ్ పరిసరాలను శుభ్రం చేస్తారని వివరించారు. కాగా, తాజ్ సిటీ ప్రమోషన్ కోసం తమ ప్రభుత్వం రూ. 370 కోట్లు మంజూరు చేయనున్నట్టు సీఎం యోగి ఇది వరకే ప్రకటించారు.