crocodiles: మొసళ్ల బోనులో ఈత కొడుతున్న యువకులు... వైరల్‌గా మారిన ఫొటో
- యువకుల అజ్ఞానాన్ని దెప్పిపొడుస్తున్న నెటిజన్లు
- ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఘటన
- చట్టవ్యతిరేకం అన్న క్వీన్స్‌ల్యాండ్ పర్యావరణ మంత్రి
అది అజ్ఞానమో లేక అవసరమో లేక సెన్సేషన్ కోసం ప్రయత్నమో తెలీదు కానీ.. మొసళ్ల కోసం ఎర వేసి ఏర్పాటు చేసిన బోనులో ఈత కొడుతున్న నలుగురు యువకుల ఫొటోను నెటిజన్లు ఇంటర్నెట్లో వైరల్‌గా మారుస్తున్నారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ ప్రాంతంలోని పోర్ట్ డాగ్లాస్ సముద్రంలో మొసళ్లు విపరీతంగా ఉండటంతో వాటిని పట్టుకోవడానికి అక్కడి అధికారులు ఫ్లోటింగ్ బోను ఏర్పాటు చేశారు. ఆ బోనులో మొసళ్లకు ఎరగా మాంసాన్ని కూడా ఉంచారు. అయితే ఈ బోనులో నలుగురు యువకులు ఈత కొడుతూ ఫొటోలు దిగారు.
ఈ ఫొటో చూసిన అధికారులు యువకుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ యువకులది తెలివితక్కువ, ప్రమాదకరమైన ప్రవర్తన. వీరు అజ్ఞానులు` అంటూ డాగ్లాస్ షైర్ మేయర్ జులియా అన్నారు. అటు క్వీన్స్‌ల్యాండ్ పర్యావరణ మంత్రి స్టీవెన్ మైల్స్ కూడా ఫొటోపై స్పందించారు. ‘ఈ బోనులో మేం మొసళ్లను ఆకర్షించేందుకు మాంసాన్ని పెట్టాం. ఆ ప్రాంతాల్లో ఈత కొట్టకండి. అది చాలా ప్రమాదకరం, చట్టవ్యతిరేకం’ అని ట్వీట్ చేశారు. ఈ ఫొటోపై స్పందించిన ఇతర నెటిజన్లు కూడా యువకుల అజ్ఞానాన్ని దెప్పిపొడుస్తూ కామెంట్లు చేశారు.