vijay: నా కొడుకు హిందూ కాదు, క్రిష్టియన్ కాదు.. భారతీయుడు.. పేరు అలా ఉంటే తప్పా?: హీరో విజయ్ తండ్రి
- విజయ్ క్రిష్టియన్ అని ఆరోపించిన బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా
- రాజా వ్యాఖ్యలపై మండిపడిన విజయ్ తండ్రి చంద్రశేఖర్
- విజయ్ ఒక మనిషి, అంతకు మించి భారతీయుడు
తమిళ నటుడు విజయ్ నటించిన ‘మెర్సల్’ సినిమా విడుదల నాటి నుంచి ఆ సినిమాపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా విజయ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయ్ ఓటర్ ఐడీని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, విజయ్ మతం మార్చుకున్నాడని, అతని పేరు సి.జోసెఫ్ విజయ్ అని ఆరోపించారు. దీనిపై విజయ్ తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడ్ని జోసఫ్ విజయ్ అని సంబోధిస్తున్నారు...ఆ పేరులో తప్పేముంది? అని ప్రశ్నించారు.
తన పేరు చంద్రశేఖర్ అని చెప్పిన ఆయన, తనది శివుడి పేరని తెలిపారు. విజయ్ క్రిస్టియనో లేక ముస్లిమో అదీ కాక హిందువో కాదని స్పష్టం చేశారు. విజయ్ ఒక మనిషి అని, అంతకుమించి భారతీయుడని ఆయన తెలిపారు. అసలు తనను అడిగితే ప్రజలకు సేవచేసేందుకు విజయ్ రాజకీయాల్లోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. విజయ్ నిర్ణయమే అంతిమమన్న ఆయన, తాను బలవంతం చేయనని అన్నారు. ‘మెర్సల్’ సినిమాలో చర్చనీయాంశమైన అంశాలను తొలగించేందుకు నిర్మాత అంగీకరించిన తరువాత కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందా? అని ఆయన మండిపడ్డారు.