Reliance: రిలయన్స్ డీటీహెచ్ వినియోగదారులకు షాక్.. డీటీహెచ్ బిజినెస్‌ను మూసేయనున్న రిలయన్స్
- వినియోగదారులకు ఆందోళన అవసరం లేదన్న రిలయన్స్
- వ్యాపారాన్ని మూసేసినా సేవలు ఆగవని స్పష్టీకరణ
- మరో సంస్థతో టై అప్‌కు చర్చలు
రిలయన్స్ డీటీహెచ్ వినియోగదారులకు ఇది చేదువార్తే. తమ డైరెక్ట్ టు హోం (డీటీహెచ్) వ్యాపారాన్ని మూసివేయాలని అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ నిర్ణయించింది. రిలయన్స్ డిజిటల్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డీటీహెచ్ బిజినెస్‌కు నవంబరు 18తో ముగింపు పలకనుంది. ఆ రోజుతో డీటీహెచ్ లైసెన్స్ గడువు ముగుస్తుండడమే అందుకు కారణంగా తెలుస్తోంది.
వ్యాపారాన్ని మూసివేసినంత మాత్రాన తమ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇతర ఆపరేటర్‌తో కలిసి డీటీహెచ్ సేవలు అందిస్తామని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇందుకోసం మూడు సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. వినియోగదారులకు నిరంతర సేవలు అందిస్తామని, ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయకుండానే కొత్త పథకాలు అందిస్తామని ఆయన వివరించారు.