2.0: రజనీకాంత్ 2.0 సినిమా ఆడియో వేడుకకు భారీగా ఏర్పాట్లు... హైలైట్స్ ఇవిగో!
- దుబాయ్ లో ఘనంగా ఈ నెల 27న 2.0 ఆడియో వేడుక
- భారీ ఏర్పాట్లు చేసిన లైకా ప్రొడక్షన్స్
- బస చేసిన హోటల్ నుంచి ఆడియో వేడుక వద్దకు హెలికాప్టర్ ఏర్పాటు
రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో శంకర్ రూపొందిస్తున్న 2.0 సినిమా ఆడియో వేడుకను సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు లైకా ప్రొడక్షన్స్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27న దుబాయ్ లో జరగనున్న ఈ వేడుక వివిధ ప్రత్యేకతలు సంతరించుకుంటోంది. ఈ వేడుకను ప్రపంచ ప్రసిద్ధ 7 స్టార్ హోటల్ బుర్జ్ దుబాయ్ లో నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా 26న రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్, ఏఆర్ రెహ్మాన్, శంకర్ లు తాము బస చేసిన హోటల్ నుంచి హెలికాప్టర్ లో బయల్దేరి బుర్జ్ దుబాయ్ హోటల్ కి చేరుకుంటారు. ఆ రోజు అంతర్జాతీయ మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఈ మేరకు జరుగుతున్న కార్యక్రమాల హైలైట్స్ ను టీజర్ రూపంలో విడుదల చేయడంతో ఈ ఆడియో వేడుకపై మరింత ఆసక్తి పెరుగుతోంది.
బుర్జ్ దుబాయ్ పార్కు హోటల్ లో ఒక సినిమా ఆడియో వేడుక జరిపేందుకు దుబాయ్ ప్రభుత్వం అనుమతివ్వడం ఈ సినిమాతోనే ప్రారంభం కానుంది. ఈ ఆడియో వేడుకలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ 125 సింఫొనీ కళాకారులతో కలిసి సంగీత విభావరి నిర్వహించనున్నాడు. ఈ సందర్భంగా ‘2.0’ సినిమా కోసం ఒక పాటకి రెహ్మాన్ లైవ్ కంపోజింగ్ చేస్తారు. శివాజీ, రోబో, 2.0 సినిమాల్లోని పాటలకు బాస్కో డ్యాన్స్ బృందం ప్రదర్శన ఇస్తుంది.
ఇక ఈ ఆడియో వేడుకను 12,000 మంది ఉచితంగా వీక్షించే ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. దుబాయ్ లోని పెద్ద పెద్ద మాల్స్ లో ఈ ఆడియో వేడుక ప్రత్యక్ష ప్రసారానికి భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ ఆడియో వేడుకలో పాల్గొనాల్సిందిగా విశ్వనాయకుడు కమల్ హాసన్ ను శంకర్ స్వయంగా కలిసి ఆహ్వానమందించారు. అలాగే దీనికి ముఖ్యఅతిథిగా దుబాయ్ రాజు హాజరయ్యే అవకాశం ఉండడం విశేషం.