tillerson: పాకిస్థాన్ పర్యటన పూర్తి చేసుకుని.. ఇండియాకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి!
- ఉగ్రవాదులను మట్టుబెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని పాక్ కు సూచన
- ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలిసి పనిచేస్తాం
- ఉగ్రవాదులకు స్వర్గధామంలా ఉన్న దేశాలను ఉపేక్షించబోం
అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్ సన్ నిన్న పాకిస్థాన్లో పర్యటించి, అక్కడి నేతలతో చర్చించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని పాకిస్థాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీకి ఆయన చెప్పారు. అలాగే, పాక్తో ద్వైపాక్షిక సహకారం వంటి అంశాలపై ఆయన చర్చలు జరిపారు.
కాగా, పాక్ నుంచి ఇండియాకు చేరుకున్న టిల్లర్ సన్.. ఈ రోజు భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్తో సమావేశమయ్యారు. ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలిసి పనిచేయడానికి తమ దేశం కృత నిశ్చయంతో ఉందని టిల్లర్ సన్ పేర్కొన్నారు. అమెరికా, భారత్ సహజ మిత్రదేశాలని అన్నారు. ఇరు దేశాలు కలిసి ఉగ్రవాదంపై పోరును కొనసాగిస్తాయని చెప్పారు.
ఉగ్రవాదులకు స్వర్గధామంలా ఉన్న దేశాలను ఉపేక్షించబోమని టిల్లర్ సన్ అన్నారు. పాకిస్థాన్ సర్కారు స్థిరత్వాన్ని ఆ ఉగ్రసంస్థలు సవాలు చేస్తున్నాయని చెప్పారు. ఆప్ఘనిస్థాన్ విషయంలో భారత్ పాత్ర ప్రశంసనీయమైందని తెలిపారు.