remix: రీమిక్స్ పాటలపై అసంతృప్తి వ్యక్తం చేసిన అలనాటి గాయని లతా మంగేష్కర్
- క్లాసికల్ పాటలను అగౌరవ పరిచినట్లేనని వ్యాఖ్య
- తాను రీమిక్స్ పాటలు వినే ప్రసక్తే లేదన్న లత
- ఇటీవల రీమిక్స్ అయిన లత పాట `మై యార్ మననా నీ`
ఒకప్పుడు బాలీవుడ్‌లో లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, కిశోర్ కుమార్ వంటి గాయనీగాయకులు పాడిన పాటలు వింటుంటే హృదయానికి చాలా హాయిగా అనిపించేది. కానీ ఇప్పుడు... హృదయం సంగతి పక్కన పెడితే, పాటలు ఎక్కువ సేపు వినడం వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలే ఎక్కువ. అందుకే పాత పాటలకే కొత్త బీట్స్ జోడించే రీమిక్స్ చేయడం ట్రెండ్‌గా మారుతుంది.
ఇటీవల అప్పట్లో హిట్ సాంగ్ `మై యార్ మననా నీ` పాటను రీమిక్స్ చేసి, దానికి బాలీవుడ్ నటి వాణి కపూర్ స్టెప్పులు వేసిన వీడియోను యశ్‌రాజ్ ఫిలింస్ విడుదల చేసింది. ఈ పాట చాలా మంది యువతకి నచ్చింది. అయితే అప్పట్లో `దాగ్` సినిమా కోసం ఈ పాట ఒరిజినల్‌గా పాడిన లతా మంగేష్కర్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు.
రీమిక్స్ చేయడం ఒరిజినల్ పాటను అగౌరవపరిచినట్లేనని ఆమె అన్నారు. అందుకే రీమిక్స్ పాటలను తాను వినబోనని చెప్పారు. `నేను ఈ రీమిక్స్ పాట వినలేదు. వినబోను కూడా. ఆ పాట మీద నేను ఎలాంటి విషయం మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒక్కటి చెబుతాను.. నేను మొదట్నుంచి రీమిక్స్ పాటలను వ్యతిరేకిస్తూనే ఉన్నాను. క్లాసిక్ పాటలను ముట్టుకోకపోవడమే మంచిది. ఇప్పటికే లక్ష్మీకాంత్ ప్యారేలాల్, మదన్ వంటి దిగ్గజాల పాటలకు బీట్స్, మాటలు కల్పించి అపవిత్రం చేశారు. అలా చేయడం తాజ్ మహల్‌కి కొత్త గదులు చేర్చడం లాంటిదే. ఒరిజినల్ పాటను క్రియేట్ చేయలేనపుడు మరొకరి పాటను రీమిక్స్ చేయడం సబబు కాదు` అని లత అన్నారు.