amitab bachchan: అమితాబ్ బచ్చన్ ఇంటి నిర్మాణంలో నిబంధనలు బేఖాతరు... బిగ్ బీకి నోటీసులు జారీ!
- 'స్వాంక్' లగ్జరీ విల్లా కూల్చేస్తాం
- నోటీసులు జారీ చేసిన ముంబై మునిసిపల్ కార్పొరేషన్
- ఆమోదిత ప్లాన్ ప్రకారం భవంతి నిర్మాణం లేదు
- అమితాబ్ తో పాటు మరింత మంది ప్రముఖులకూ నోటీసులు
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నిబంధనలకు విరుద్ధంగా లగ్జరీ బంగళా 'స్వాంక్'ను నిర్మించుకున్నారని ఆరోపిస్తూ, దాన్ని ఎందుకు కూల్చరాదో తెలియజేయాలని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అత్యంత విలాసవంతమైన ఈ భవనం ముంబైలోని గోరేగామ్ ఈస్ట్ ప్రాంతంలో ఫిలిం సిటీకి సమీపంలో ఉంది.
ఈ భవంతిపై ఆరోపణలు రాగా, టౌన్ ప్లానింగ్ అధికారులు తనిఖీలు చేసి, తాము అనుమతించిన విధంగా కాకుండా నిబంధనలు మీరి బంగళాను నిర్మించారని, బేస్ మెంటు, లిఫ్ట్, ప్రహరీగోడ తదితరాలు ఆమోదిత ప్లాన్ ప్రకారం లేవని తేల్చారు. దీంతో బిగ్ బికి నోటీసులు జారీ చేసినట్టు మునిసిపల్ అధికారులు వెల్లడించారు.
ఇదిలావుండగా, అమితాబ్ బచ్చన్ తో పాటు ముంబై పరిధిలో అక్రమంగా బంగళాలు నిర్మించుకున్నారన్న ఆరోపణలపై నిర్మాతలు రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ వ్యాస్, హరీష్ జగిత్యాని, హరీష్ ఖండేల్ వాల్, పంకజ్ బాలాజీలతో పాటు ఓబరాయ్ రియల్టీ సంస్థకు కూడా మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది.