Swiss: ఉత్తరప్రదేశ్లో దేశానికి తలవంపులు తెచ్చే ఘటన.. స్విస్ పర్యాటక జంటపై యువకుల వేధింపులు, దాడి.. పరిస్థితి విషమం
- గంటపాటు వేధించిన నలుగురు యువకులు
- అసభ్య పదజాలంతో బలవంతంగా సెల్ఫీలు
- కర్రతో దాడి.. యువకుడి పుర్రెకు ఫ్రాక్చర్
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. భారత పర్యటనకు వచ్చిన స్విస్ జంటపై నలుగురు యువకులు కలిసి దాడి చేశారు. వారిని అడ్డుకుని గంటపాటు వేధించారు. ఈ ఘటన ఆదివారం ఫతేపూర్ సిక్రీలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. స్విట్జర్లాండ్లోని లాసానె నగరానికి చెందిన క్వెంటిన్ జెరెమీ క్లెరిక్ (24), గాళ్ ఫ్రెండ్ మారీ డ్రోక్జ్ (24)లు కలిసి తమ పర్యటనలో భాగంగా ఫతేపూర్ సిక్రీ చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో వారిని చూసిన నలుగురు యువకులు వారిని అనుసరించడం మొదలుపెట్టారు. వారిని కామెంట్లు చేస్తూ వేధించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వారిని ఆపి యువతితో బలవంతంగా ఫొటోలు తీసుకున్నారు.
తాము సెప్టెంబరు 30న ఇండియాకు వచ్చామని, శనివారం ఆగ్రా చేరుకున్నట్టు చెప్పారు. అక్కడ రెండురోజుల ఉన్న తర్వాత ఆదివారం ఫతేపూర్ సిక్రీ వచ్చినట్టు క్వెంటిన్ తెలిపాడు. రైల్వే స్టేషన్లో నిలబడి ఉండగా యువకులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని, బలవంతంగా సెల్పీలు తీసుకున్నారని చెప్పాడు. వాళ్లేవో కామెంట్లు చేశారని, అయితే అవి తమకు అర్థం కాలేదన్నాడు.
తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఫొటోలు తీస్తూనే ఉన్నారని వాపోయాడు. ఆ తర్వాత వారు తన తలపై కర్రతో దాడి చేశారని, తాను కిందపడిపోయినా కొడుతూనే ఉన్నారని తెలిపాడు. దీంతో తన గాళ్ ఫ్రెండ్ సాయం కోసం కేకలు వేసిందని పేర్కొన్నాడు. ఆమెపైనా వారు దాడి చేశారన్నాడు. తమకు సాయం కోసం వచ్చిన వారిని చూసి యువకులు పారిపోయారని వివరించాడు.
గాయాలపాలైన జంటను పోలీసులు తొలుత స్థానిక ఆసుపత్రికి, ఆ తర్వాత ఆగ్రాకు తరలించారు. పరిస్థితి మరింతగా విషమించడంతో వారిని అక్కడి నుంచి ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. క్వెంటిన్కు పుర్రెకు ఫ్రాక్చర్ అయిందని, మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడిని ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. యువతి ఎడమ చేయికి గాయమైనట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికుల సాయంతో నిందితుల కోసం వేట ప్రారంభించారు. నిందితుల్లో ఇద్దరిని గుర్తించారు. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.