us visa: 13 ఏళ్ల నిబంధనకు సవరణలు... హెచ్-1బీ కావాలంటే నిరూపించుకోవాలట!
- అన్ని విధాలా అర్హుడినని నిరూపించుకోవాలి
- కొత్త దరఖాస్తులు ఇక యూఎస్సీఐఎస్ పరిధిలో ఉండవు
- రెన్యువల్స్ అయినా ఇకపై కష్టమే
అమెరికాలో హెచ్-1బీ, ఎల్1 వీసాల రెన్యువల్ ఇకపై మరింత క్లిష్టతరం కానుంది. ఇండియన్ టెక్కీలు అధికంగా వాడుకునే ఈ వీసాల జారీ, పునరుద్ధరణ నిబంధనలను సవరిస్తూ అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 సంవత్సరాల నుంచి అమలులో ఉన్న నిబంధనలను మార్చుతూ యూఎస్సీఐఎస్ (యూఎస్ సిటిజన్ షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్) కొత్త నిర్ణయాలు ప్రకటించింది.
వీటి ప్రకారం, ఇప్పటివరకూ అమలులో ఉన్న పద్ధతిలో దరఖాస్తుదారు వీసాలు పొందలేడు. యూఎస్సీఐఎస్ ఇకపై అమెరికాలో ఉంటూ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే వీసా సిఫార్సులు చేస్తుంది. కొత్తగా దరఖాస్తు చేసే వారికి ఈ విభాగం సిఫార్సులు చేయదు. హెచ్-1బీ వీసా తీసుకునేందుకు లేదా రెన్యువల్ కు తాను అన్ని విధాలుగా అర్హుడినేనని దరఖాస్తుదారు తనను తాను నిరూపించుకోవాల్సి వుంటుంది.
నిబంధనల మేరకు అన్నీ సక్రమంగా ఉంటేనే వీసాల జారీ, పునరుద్ధరణ ఉంటుందని, తమ దేశంలోని ఉద్యోగాలను విదేశీయులు తన్నుకుపోకుండా ఉండేందుకే ఇలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని అమెరికా పేర్కొంది. ఇకపై అత్యుత్తమ నైపుణ్యం ఉన్నవారికే హెచ్-1బీ వీసాలు వస్తాయని వెల్లడించింది.