gujarath: గుజరాత్ లో తిష్ఠ వేసిన ఉగ్రవాదులను చాకచక్యంగా బంధించిన ఏటీఎస్!
- డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు
- అడ్డుకునే వ్యూహంతో దాడులకు ప్లాన్
- భగ్నం చేసిన ఏటీఎస్ పోలీసులు
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి సాధ్యమైనంత ఎక్కువ ప్రాణనష్టాన్ని కలిగించాలన్న లక్ష్యంతో తిష్ఠవేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, సూరత్ ప్రాంతంలో మారణహోమం సృష్టించే పనిలో నిమగ్నమైన ఇద్దరిని ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎన్నికలను అడ్డుకోవడమే వీరి ప్రధాన ఉద్దేశమని ప్రాథమిక విచారణలో తేలినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గుజరాత్ ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 9న 19 జిల్లాల్లోని 89 స్థానాల్లో తొలిదశలోను, ఆపై మిగిలిన 14 జిల్లాల్లోని 93 స్థానాల్లో డిసెంబర్ 14న రెండో దశలోను ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రెండో దశ ఎన్నికల కోసం నవంబర్ 20న నోటిఫికేషన్ జారీ అవుతుంది. హిమాచల్ ప్రదేశ్ తో పాటు గుజరాత్ ఓట్లను డిసెంబర్ 18న లెక్కిస్తారు. 1998 నుంచి గుజరాత్ లో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ, ఈ దఫా కూడా విజయం సాధించాలన్న కృత నిశ్చయంతో ఉండగా, అధికారం తమకే దక్కుతుందని కాంగ్రెస్ ఆశగా ఉంది.