honda grazia: కొత్తతరానికి కొత్త స్కూటర్... 'గ్రాజియా'ను తొలిసారి చూపించిన హోండా, బుకింగ్స్ మొదలు
- పట్టణ మార్కెట్ కోసం గ్రాజియా
- రూ. 2 వేలు కట్టి ముందస్తు బుకింగ్
- ధర కనీసం రూ. 54 వేలు
- డిజిటల్ డిస్ ప్లే, యూఎస్బీ చార్జింగ్ సాకెట్ అదనపు ఆకర్షణ
గత వారంలో హోండా ప్రకటించిన 'గ్రాజియా' స్కూటర్ ను తొలిసారిగా ప్రదర్శించింది సంస్థ. పట్టణ మార్కెట్ కస్టమర్లను టార్గెట్ గా చేసుకుని తయారు చేసిన ఈ స్కూటర్ ఇప్పటికే పేరు తెచ్చుకున్న యాక్టివా 125తో పాటే లభిస్తుందని సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని హోండా డీలర్ షిప్ కేంద్రాల వద్ద రూ. 2 వేలు కట్టి ఈ స్కూటర్ ను బుక్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. 125 సీసీ ఇంజన్ సామర్థ్యంతో ఇది లభిస్తుందని, కొత్త తరం యువతకు కొత్త స్కూటర్ గా దీన్ని అత్యాధునిక ఫీచర్లతో తయారు చేశామని సంస్థ పేర్కొంది.
దీని ధరను ఎంచుకునే వేరియంట్, కొనుగోలు చేసే ప్రాంతాన్ని బట్టి రూ. 54 వేల నుంచి రూ. 65 వేల మధ్య ఉంటుందని సంస్థ వర్గాలు వెల్లడించాయి. డ్యూయల్ హెడ్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ పెయింట్, డిజిటల్ డిస్ ప్లే, మరింత స్టోరేజ్ స్పేస్, యూఎస్బీ చార్జింగ్ సాకెట్, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్, 8.52 బీహెచ్పీ దీనికి అదనపు ఆకర్షణలు. పైగా యాక్టివాతో పోలిస్తే ఇది బరువు తక్కువ కూడా. గ్రాజియా అమ్మకాలు సంతృప్తికరంగా ఉంటాయని భావిస్తున్నట్టు హోండా పేర్కొంది.