ketireddy: తేజను, వర్మను ఏమీ అనలేదు... మధ్యలో నన్నెందుకు అంటున్నారు?: లక్ష్మీపార్వతికి కేతిరెడ్డి సూటి ప్రశ్న
- లక్ష్మీ పార్వతిపై నిప్పులు చెరిగిన నిర్మాత కేతిరెడ్డి
- నా చిత్రం గురించి చెబితే ఉలికిపాటెందుకు?
- బహిరంగ చర్చకు సిద్ధమా?
- వీరగంధం సుబ్బారావు జీవిత కథను తీసి చూపిస్తా
ఓ వాస్తవ ఘటనను తాను తెరకెక్కించాలని భావిస్తుంటే, లక్ష్మీ పార్వతికి అంత ఉలుకెందుకని టాలీవుడ్ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి, కన్నీరు పెట్టుకుంటూ లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడిన తరువాత 'లక్ష్మీస్ వీరగ్రంధం' చిత్రాన్ని ప్రకటించిన కేతిరెడ్డి స్పందించారు.
ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన, "నేను లక్ష్మీ పార్వతిని ఒకటే అడగదలచుకున్నాను. వాటికి ఆమె సమాధానం చెప్పాలి. ఎన్టీఆర్ చరిత్రపై ముందు భాగం తీస్తానన్న వాళ్లకు నువ్వు అభ్యంతరం చెప్పలా. చివరి భాగం తీస్తానన్న రామ్ గోపాల్ వర్మకు అభ్యంతరం చెప్పలా. మధ్యలో నేను తీస్తానన్న కథకు ఇంత ఉలికిపాటు ఎందుకు? దీని వెనకాల చాలా సంఘటనలు ఉన్నాయని నాకో అనుమానం ఉంది. దీనికి ఆమె సమాధానం చెప్పాలి. ఆమె బహిరంగ వేదికపై చర్చకు సిద్ధమా? వీరగంధం సుబ్బారావు జీవితకథను నేను తీస్తానంటే, ఆమెకు అభ్యంతరం ఎందుకు?" అని ప్రశ్నించారు.
తాను ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన వాడినని, తనను అడ్డుకోవాలని భావిస్తే, లక్ష్మీపార్వతి కోర్టుకు వెళ్లవచ్చని అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సినిమా తీసి తీరుతానని అన్నారు.