dangerous stunt: ఒళ్లు గగుర్పొడిచే సాహసకృత్యం.. ప్రాణం కోల్పోయిన స్టంట్ మేన్.. మలేషియాలో దుర్ఘటన!
- కౌలా సంగ్ లంగ్ టెంపుల్ లో మలేసియన్ టయోయిస్ట్ ఫెస్టివల్
- ఫెస్టివల్ సందర్భంగా హ్యూమన్ స్టీమింగ్ స్టంట్ ప్రదర్శించిన లిమ్ బా
- ప్రాణాంతమైన హ్యూమన్ స్టీమింగ్ స్టంట్
మలేషియాలో హ్యూమన్ స్టీమింగ్ స్టంట్ విషాదాంతమైంది. దాని వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర కెడాలోని కౌలా సంగ్ లంగ్ టెంపుల్ లో మలేషియన్ టయోయిస్ట్ ఫెస్టివల్ ను నిర్వహించారు. ఈ ఫెస్టివల్ లో హ్యూమన్ స్టీమింగ్ స్టంట్ షో ను లిమ్ బా (68) అనే స్టంట్ మాన్ నిర్వహించారు. ఆయనకు ఇందులో చాలా అనుభవం ఉంది. గత పదేళ్లుగా ఆయన ఈ స్టంట్ ను ఎంతో నైపుణ్యంతో చేస్తున్నారు.
హ్యూమన్ స్టీమింగ్ స్టంట్ అంటే.. మూకుడు లాంటి పెద్ద గిన్నె కింద మంట పెట్టి.. దాని మీద మూత బోర్లించి.. మనిషిని ఆ మూత మీద కూర్చోబెడతారు. తర్వాత ఆ మనిషి మీద మరో పెద్ద గిన్నె లాంటిదానిని బోర్లిస్తారు. కింద మంట పెడుతున్నా లోపల ఉన్న వ్యక్తికి ఎటువంటి హానీ జరగదు. అంతే కాదు.. ఆ మంట వల్ల వచ్చే ఆవిరితో పక్కన స్వీట్ కార్న్, బన్నులను తయారు చేస్తారు. అయితే, ఈ స్టంట్ ప్రారంభమైన కాసేపటికి లోపలి నుంచి గట్టిగా అరిచిన శబ్దం రావడంతో వెంటనే దాని మూతను తొలగించారు.
అప్పటికే లోపల కూర్చున్న స్టంట్ మాన్ లిమ్ బా గిల గిలా కొట్టుకుంటున్నాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీనిపై వైద్యులు మాట్లాడుతూ, ఆయనకు స్టంట్ సమయంలో హార్ట్ అటాక్ వచ్చిందని, దానికి తోడు ఆయన శరీరం కూడా కాలిపోయిందని, దీంతోనే ఆయన మృతిచెందారని తెలిపారు. దీనిపై సంఘటనా స్థలంలోనే ఉన్న లిమ్ బా కుమారుడు మాట్లాడుతూ, తన తండ్రికి గత సంవత్సరమే హార్ట్ సర్జరీ జరిగిందని అన్నాడు. దీంతో ప్రమాదకర స్టంట్స్ చేయొద్దన్నా వినలేదని అన్నాడు. అయితే ఇదే ఆయన చివరి స్టంట్ అవుతుందని తాము ఊహించలేదని కంటతడిపెట్టుకున్నాడు.