kishan reddy: తెలంగాణ సర్కారుని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని నిర్ణయించాం: టీడీపీ, బీజేపీ సంయుక్త సమావేశం అనంతరం కిషన్ రెడ్డి
- అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ, టీడీపీ నేతల భేటీ
- టీడీపీ నుంచి ఎల్.రమణ, ఆర్.కృష్ణయ్య, సండ్ర వెంకట వీరయ్య, మోత్కుపల్లి హాజరు
- బీజేపీ నుంచి కిషన్రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, చింతల రామచంద్రారెడ్డి
- మొత్తం 25 అంశాలను లేవనెత్తనున్న నేతలు
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తాము అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ రోజు తెలంగాణ బీజేపీ, టీడీపీ నేతలు హైదరాబాద్లోని గోల్కొండ హోటల్లో భేటీ అయి చర్చించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు ఎల్.రమణ, ఆర్.కృష్ణయ్య, సండ్ర వెంకట వీరయ్య, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు హాజరయ్యారు. బీజేపీ నుంచి కిషన్రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, చింతల రామచంద్రారెడ్డి హాజరయ్యారు.
తెలంగాణ సర్కారుని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని తాము నిర్ణయించినట్లు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేపటి నుంచి జరిగే సమావేశాల్లో తాము కీలక పాత్ర పోషిస్తామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలు, నేరెళ్ల ఘటనపై సర్కారుని ప్రశ్నిస్తామని చెప్పారు. మొత్తం 25 అంశాలను లేవనెత్తుతామని అన్నారు.