swiss couple: స్విస్ జంటపై దాడి కేసులో ఐదుగురు మైనర్ల అరెస్ట్.. కొనసాగుతున్న గాలింపు
- ఫతేఫూర్ సిక్రీలో స్విస్ జంటపై దాడి
- నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న సీఎం యోగి
- పొదలమాటున ఏకాంతంగా ఉండగా దాడి చేశారన్న డీఎస్పీ
స్విట్జర్లాండ్ జంటపై దాడి కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటి వరకు ఐదుగురు మైనర్లను అరెస్ట్ చేశారు. భారత పర్యటనకు వచ్చిన క్వెంటిన్ జెరెమీ క్లెర్క్, మారీ డ్రోజ్లపై ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్సిక్రీలో దాడి జరిగింది. కొందరు వ్యక్తులు వారిని అనుసరించి బలవంతంగా వారితో సెల్ఫీలు తీసుకున్నారు. ప్రశ్నించిన వారిపై కర్రతో దాడి చేశారు. వారి దాడిలో క్వెంటిన్ తలకు తీవ్ర గాయమైంది. డ్రోజ్ ఎడమచేయి విరిగింది. ప్రస్తుతం వీరు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
స్విస్ జంటపై దాడి సంచలనం సృష్టించింది. పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేసే ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. స్విస్ జంటపై దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గురువారం పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురూ మైనర్లే కావడం గమనార్హం. పరారీలో ఉన్న ఆరో నేరగాడూ కూడా మైనరే అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
కాగా, స్విస్ జంట పొదల మాటున ఏకాంతంగా ఉండడాన్ని చూసిన నిందితులు వారిపై దాడి చేశారని డీఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ తెలిపారు.