pakistan: పాక్‌ను అమెరికా హెచ్చరించిన మరునాడే.. మిత్రదేశాన్ని ప్రశంసించిన చైనా!
- ఉగ్రవాదంపై పాక్ చర్యలు భేష్
- ఉగ్రవాదంపై పోరుకు పాక్, అమెరికాలను ఆహ్వానిస్తున్నాం
- స్నేహసంబంధాల వల్ల ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొంటుందన్న చైనా
అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ భారత పర్యటనకు వస్తూవస్తూ పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా మారిందని, ఇక ఎంతమాత్రమూ సహించబోమని హెచ్చరించారు. టిల్లర్సన్ హెచ్చరించి ఒక్క రోజైనా గడవకముందే పాక్ మిత్ర దేశం చైనా స్పందించింది. ఉగ్రవాదంపై పాక్ చేస్తున్న పోరాటాన్ని ప్రశంసించింది.
‘‘ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు పాకిస్థాన్ తీసుకుంటున్న చర్యలు భేష్. ఇందుకోసం పాక్ గొప్ప త్యాగాలు చేస్తోంది’’ అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ ప్రశంసించారు. అంతేకాదు.. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు పాక్ తీసుకుంటున్న చర్యలను ప్రపంచం మొత్తం ప్రశంసించాల్సి ఉందన్నారు.
చాలా ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ స్వర్గధామంగా మారిందన్న టిల్లర్సన్ వ్యాఖ్యలకు షువాంగ్ స్పందిస్తూ.. పరస్పర సహకారంతో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు పాకిస్థాన్, అమెరికాలను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ‘‘అమెరికా, భారత్, పాకిస్థాన్ సహా అన్ని దేశాలను సత్సంబంధాల కోసం చైనా ఆహ్వానిస్తోంది’’ అని షువాంగ్ పేర్కొన్నారు. ఆయా దేశాలతో సత్సంబంధాల వల్ల ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.