donald trump. alcohol addict: అమెరికా అధ్యక్షుడు మద్యం తీసుకోకపోవడానికి కారణం వాళ్ల అన్నయ్య!
- ప్రసంగంలో వెల్లడించిన డొనాల్డ్ ట్రంప్
- మద్యానికి బానిసై చనిపోయిన ట్రంప్ అన్నయ్య
- ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించిన అమెరికా
అమెరికాలో రోజురోజుకీ ఒపియాడ్ డ్రగ్స్ వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ సందర్భంగా వైట్ హౌస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. తనకు మద్యం సేవించడం, పొగ త్రాగడం వంటి దురలవాట్లు లేకపోవడానికి వెనక గల కారణాలను ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రసంగంలో వాళ్లన్నయ్య ఫ్రెడ్ ట్రంప్ జూనియర్ గురించి ప్రస్తావిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు.
‘మా అన్నయ్య ఫ్రెడ్ ట్రంప్ జూనియర్. చాలా గొప్ప వ్యక్తి. నా కంటే చాలా అందంగా ఉండేవారు. అయితే ఆయనకు ఓ సమస్య ఉంది. ఆయన మద్యానికి బానిసయ్యారు. దాని వల్ల అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. అన్నయ్య తరచూ నాకు మద్యం తాగొద్దని చెప్పేవారు. నా కంటే పెద్దవాడు అనుభవంతో చెప్పడంతో నేను ఆయన మాటలకు గౌరవం ఇచ్చాను. ఆయన పడుతున్న కష్టాలను చూసిన తర్వాతే ఇంకెప్పుడూ మద్యం సేవించొద్దని, పొగ తాగొద్దని నిర్ణయించుకున్నాను. ఆయన 43 ఏళ్లకే చనిపోయాడు’ అని ట్రంప్ చెప్పారు. అంతేకాకుండా ప్రచార కార్యక్రమాల ద్వారా యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ట్రంప్ అభిప్రాయపడ్డారు.