japan: జుట్టుకు నల్ల రంగు వేసుకో.. లేదంటే స్కూలు మానేయ్!... విద్యార్థినిని ఇబ్బంది పెట్టిన జపాన్ స్కూల్!
- రంగు వేసుకోవడంతో ఆరోగ్య సమస్యలు
- నష్టపరిహారం కోసం కోర్టును ఆశ్రయించిన విద్యార్థిని
- ఆరోపణలను కొట్టిపారేసిన పాఠశాల యాజమాన్యం
తనకు పుట్టుకతో వచ్చిన గోధుమ రంగు జుట్టుకు నల్ల రంగు వేసుకోవాలని, లేకపోతే పాఠశాలకు రావొద్దని చెబుతున్నారని జపాన్‌కి చెందిన ఓ విద్యార్థిని పాఠశాల యాజమాన్యంపై కేసు వేసింది. ఒసాకాలోని హబికినో సిటీలో కైఫూకన్ స్కూల్లో చేరే ముందే తన జుట్టు రంగు గురించి పాఠశాల యాజమాన్యానికి తాను వెల్లడించానని ఒసాకా జిల్లా కోర్టులో వేసిన పిటిషన్లో సదరు విద్యార్థిని పేర్కొంది.
సాధారణంగా జపాన్ స్కూళ్లలో జుట్టుకి రంగు వేసుకున్న వారికి అడ్మిషన్ ఇవ్వరు. పుట్టుకతోనే తనకు గోధుమ రంగు జుట్టు రావడంతో రంగు వేసుకుంటుందని భ్రమపడి ఆమెకు అడ్మిషన్ ఇవ్వరేమోనని విద్యార్థిని తల్లి ముందే యాజమాన్యానికి విషయం చెప్పింది. అయితే ఇందుకు విరుద్ధంగా గోధుమ రంగు జుట్టుకు నల్ల రంగు వేసుకు రమ్మని పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని పదే పదే వేధించేదని జపాన్ మీడియా తెలిపింది.
అయితే తరచుగా నల్ల రంగు వేసుకోవడం వల్ల తలనొప్పి, జుట్టు పాడవడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చిందని, అందుకు గాను పాఠశాల యాజమాన్యం 2.2 మిలియన్ యెన్లు పరిహారంగా ఇప్పించాలని ఆ విద్యార్థిని పిటిషన్లో పేర్కొంది. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదని కైఫూకన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మసాహికో టకహసీ అన్నాడు. రంగు వేసుకోవడాన్ని నిషేధించిన పాఠశాల, మళ్లీ రంగు వేసుకోవాలని ఎలా చెబుతుందని మసాహికో ప్రశ్నించాడు.