revant reddy: నీతో విడిగా సమావేశం కాబోను: రేవంత్ కు తేల్చి చెప్పిన చంద్రబాబు
- 'కొద్దిసేపు విడిగా మాట్లాడాలి' అని అడిగిన రేవంత్
- ససేమిరా కుదరదన్న చంద్రబాబు
- ఏదైనా నలుగురి మధ్యే చెప్పాలన్న బాబు
- రేవంత్ పై టీడీపీ నేతల ప్రశ్నల వర్షం
ఈ ఉదయం చంద్రబాబునాయుడు పిలుపు మేరకు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు వచ్చిన రేవంత్ రెడ్డికి అవమానం ఎదురైంది. ఈ సమావేశానికి వచ్చీ రాగానే, చంద్రబాబుకు నమస్కరించిన రేవంత్, "మీతో కొద్దిసేపు విడిగా మాట్లాడాలి" అని అనగా, అటువంటి అవసరం లేదని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు సమాచారం. విడిగా ఎవరితోనూ సమావేశాలు అయ్యేది లేదని చంద్రబాబు స్పష్టం చేయడంతో ఇక చేసేదేమీ లేక, మిగతావారితో పాటే ఈ సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు.
తప్పు చేస్తే క్రమశిక్షణా చర్యలుంటాయని, ముఖ్యంగా కార్యకర్తల్లో అయోమయం, గందరగోళానికి గురిచేసేలా మాటలు, చేష్టలను తాను సహించేది లేదని ఈ సందర్భంగా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రేవంత్ ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిశారా? కలిస్తే ఎందుకు కలిశారు? ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం నేతలపై తీవ్ర విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటూ టీడీపీ నేతలు చంద్రబాబు ముందే రేవంత్ పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఇక, తాజా పరిణామాలపై చర్చించిన చంద్రబాబు కాసేపట్లో తన నిర్ణయం ప్రకటించనున్నట్టు సమాచారం.