cancer patients: స్మైల్ మిర్రర్.... కేన్సర్ పేషంట్లకు ప్రత్యేకం!
- నవ్వితేనే పనిచేసే అద్దం
- అభివృద్ధి చేసిన బెర్క్ ఇల్హాన్
- పిచ్చి వస్తువు అంటున్న విమర్శకులు
తమ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసి చిరునవ్వు అంటే ఎలా ఉంటుందో మర్చిపోయే కేన్సర్ పేషెంట్ల కోసం టర్కీకి చెందిన ఇండస్ట్రియల్ డిజైనర్ బెర్క్ ఇల్హాన్ ఓ అద్దాన్ని తయారుచేశాడు. దీని పేరు స్మైల్ మిర్రర్. ప్రత్యేకంగా ఇది కేన్సర్ పేషెంట్లకు మాత్రమే. దీని ముందు నవ్వు ముఖంతో కనిపిస్తేనే ఇది పనిచేస్తుంది. విచారంగా కానీ, మరేదైనా హావభావాన్ని కానీ ప్రదర్శిస్తే ఈ అద్దం పనిచేయదు. కేన్సర్ పేషెంట్ల సంతోషం కోసం తయారు చేసిన ఈ అద్దాన్ని కొంతమంది విమర్శకులు పిచ్చి వస్తువుగా అభివర్ణిస్తున్నారు. అసలే బాధలో ఉన్న వారిని నవ్వు కోసం ఇబ్బంది పెట్టడం సబబు కాదని వారు అంటున్నారు.
అయితే కేన్సర్ పేషెంట్లు నవ్వడం అలవాటు చేసుకుంటే వారిలో ధైర్యం పెరుగుతుందని, జబ్బుకి సంబంధించిన ఒత్తిడి తగ్గుతుందని అద్దం సృష్టికర్త బెర్క్ ఇల్హాన్ అంటున్నాడు. తాను న్యూయార్క్‌లోని స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్‌లో చదువుకుంటున్నపుడు కేన్సర్ వ్యాధిగ్రస్తుల బాధను దగ్గర్నుంచి గమనించానని, అప్పుడే వారికోసం ఈ అద్దాన్ని తయారు చేసినట్లు బెర్క్ తన వెబ్సైట్లో పేర్కొన్నాడు.