ap dgp: కంచ ఐలయ్యను గృహ నిర్బంధం చేయాలని తెలంగాణ సర్కారుతో మాట్లాడా: ఏపీ డీజీపీ
- కులాలు, మతాలకు సంబంధించిన సభలు, ఆందోళనలకు అనుమతులు ఇవ్వలేం
- శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే అరెస్టు చేస్తాం
- తునిలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని అనుమతులు ఇవ్వట్లేదు
'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అంటూ ప్రొ.కంచ ఐలయ్య రాసిన పుస్తకంపై వివాదం చెలరేగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంచ ఐలయ్యకు మద్దతుగా విజయవాడలో నిర్వహించతలపెట్టిన సభకు అనుమతి లేదని, ఆయనను గృహ నిర్బంధం చేయాలని తెలంగాణ సర్కారుతో మాట్లాడానని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. కులాలు, మతాలకు సంబంధించిన సభలు, ఆందోళనలకు అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. గతంలో కాపుల సభ నేపథ్యంలో తునిలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని అనుమతులు ఇవ్వడం లేదని అన్నారు.
రేపు విజయవాడలో తలపెట్టిన కంచ ఐలయ్య సభకు కానీ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాల సభకు గానీ అనుమతులు ఇవ్వలేదని డీజీపీ సాంబశివరావు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు.