Ys jagan reddy: అవమానభారాన్ని భరించడం ఇక మావల్ల కాదు.. రాష్ట్రపతికి జగన్ లేఖ

  • ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునే వరకు అసెంబ్లీకి హాజరుకాబోము
  • రాష్ట్రాన్ని చంద్రబాబు అడ్డగోలుగా దోచుకుంటున్నారు
  • ఏపీ లక్షల కోట్ల అప్పుల్లో ఉంది
  • జోక్యం చేసుకుని రాష్ట్రాన్ని కాపాడండి
  • రామ్‌నాథ్ కోవింద్‌కు రాసిన లేఖలో జగన్

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. ప్రతిపక్షం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి తక్షణం జోక్యం చేసుకుని చంద్రబాబు ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.

 వైసీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా అసెంబ్లీ వెబ్‌సైట్‌లో వారిని ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలుగా చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఫిరాయింపుదారుల్లో నలుగురిని మంత్రులుగా కొనసాగిస్తున్నారని తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేంత వరకు శాసనసభకు, మండలికి హాజరు కారాదని నిర్ణయించినట్టు లేఖలో వివరించారు. జగన్ రాసిన ఈ లేఖను ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి విడుదల చేశారు.

జగన్ రాసిన లేఖలోని ముఖ్యాంశాలు ఇలా..
* టీడీపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు.
* వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని మంత్రి పదవులు, డబ్బుల ఆశ చూపి టీడీపీలో చేర్చుకున్నారు.
* వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను, శాసనమండలి చైర్మన్‌ను ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకుండా పోయింది.  
* వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథ్‌రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, సుజయకృష్ణ రంగారావు, భూమా అఖిలప్రియలకు రాజ్యాంగ విరుద్ధంగా మంత్రి పదవులు కట్టబెట్టారు.
* ఫిరాయింపుదారులైన జ్యోతుల నెహ్రూ, ఉప్పులేటి కల్పలనలను వైసీపీ ఉప నేతలుగానే చూపిస్తున్నారు.
* ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునేంత వరకు శాసనసభకు, శాసన మండలికి హాజరు కాకూడదని నిర్ణయించాం.
* అబద్ధపు హామీలతో గత ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు.
* రాష్ట్రంలో ఇసుక, మద్యం, రియల్ ఎస్టేట్ మాఫియా పెరిగిపోయింది. స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులే ఈ మాఫియాను నడిపిస్తున్నారు.
* ఏపీపై ప్రస్తుతం రూ.2.05 లక్షల కోట్ల రుణభారం ఉంది.
* అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదు.
* స్వయంగా స్పీకరే సభా నిబంధనలను కాలరాస్తున్నారు.
* ఇన్నాళ్లూ అవమానభారాన్ని భరించాం.. ఇక మావల్ల కాదు.
* ఏపీలో ప్రజాస్వామ్యానికి జరుగుతున్న పరిహాసాన్ని ఆపుతారనే ఈ లేఖ.


  • Loading...

More Telugu News