Mersal: ఇష్టం లేకపోతే సినిమా చూడడం మానేయండి... ‘మెర్సల్’ సినిమాపై మద్రాసు హైకోర్టు కీలక తీర్పు!
- సినిమాను నిషేధించాలన్న పిటిషన్ను కొట్టివేసిన కోర్టు
- ఇష్టం లేకపోతే చూడడం మానేయాలంటూ పిటిషన్దారుడికి మొట్టికాయలు
- సినిమాలోని ‘దేవాలయం’ డైలాగుపై కోర్టుకెక్కిన లాయర్
తమిళ నటుడు విజయ్ నటించిన మెర్సల్ సినిమాపై మద్రాసు హైకోర్టు శుక్రవారం కీలకతీర్పు వెలువరించింది. వివాదాస్పద డైలాగులతో ఉన్న ఈ సినిమాను నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించిన కోర్టు.. సినిమాను ఇష్టం లేకపోతే చూడడం మానేయాలంటూ పిటిషన్దారుడికి సూచించింది. ఇదో ఊహాత్మక చిత్రమే తప్పించి ప్రత్యేకంగా ఎవరినో ఉద్దేశించి తీసిన రియల్ లైఫ్ చిత్రం కాదని తేల్చి చెప్పింది. సినిమాను చూడడంలో ఇబ్బంది ఉంటే చూడడం మానేయాలని తేల్చి చెప్పింది. అంతేకాదు.. సినిమాల్లో ధూమపానం, తాగుడు గురించి ఎందుకు ఫిర్యాదు చేయరని ప్రశ్నించింది. అలాగే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ విషయాలపై మౌనంగా ఎందుకు ఉంటారని నిలదీసింది.
‘‘దేవాలయాలను నిర్మించాల్సిన అవసరం లేదు. మాకు ఆసుపత్రులు కావాలి’’ అంటూ సినిమాలో చెప్పే డైలాగుపై మధురైకి చెందిన న్యాయవాది కోర్టుకెక్కారు. ఈ డైలాగు హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినిమాను నిషేధించాలని కోర్టును అభ్యర్థించారు. సినిమాను నిలిపివేయడంతో దానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ను ఉపసంహరించుకునేలా ఆదేశించాలని కోర్టును కోరారు. విచారించిన కోర్టు పిటిషన్ను కొట్టివేస్తూ.. ఇష్టం లేకపోతే సినిమా చూడడం మానేయాలని పిటిషన్దారుడికి మొట్టికాయలు వేసింది. అది ఏ ఒక్కరినో ఉద్దేశించి తీసిన సినిమా కాదని, అదో ఊహాత్మక చిత్రమని స్పష్టం చేసింది.