gajjela kantam: వాగ్వాదానికి దిగిన గజ్జెల కాంతంను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- డ్రంకెన్ డ్రైవ్ లో పోలీసులతో వాగ్వాదానికి దిగిన ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జెల కాంతం
- బ్రీత్ అనలైజర్ పరీక్షలకు నిరాకరించిన కాంతం
- అదుపులోకి తీసుకుని, విడిచిపెట్టిన పోలీసులు
డ్రంకెన్ డ్రైవ్ లో ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం పట్టుబడడం కరీంనగర్ లో కలకలం రేపింది. కరీంనగర్ లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సమయంలో గజ్జెల కాంతం అటువైపు గా వచ్చారు. దీంతో ఆ వాహనాన్ని ఆపి బ్రీత్ అనలైజర్ తనిఖీలు చేసేందుకు ప్రయత్నించడంతో, ఆయన పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ లోపలికి వెళ్లిపోయారు. దీంతో ఆయనను అనుసరించిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాను మద్యం సేవించి వాహనం నడపడం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను వాహనం నడపనప్పుడు బ్రీత్ ఎనలైజర్ టెస్టు ఎందుకు జరుపుకోవాలని ఆయన వారిని ప్రశ్నించారు. కేవలం తనను ఇబ్బంది పెట్టాలని లేదా కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. దీంతో చట్టాన్ని గౌరవించాలని పోలీసులు సూచించడంతో ఆయన పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అనంతరం కాసేపటికి ఆయనను పోలీసులు వదిలేశారు.