congress: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌కు ఐసిస్ ఉగ్రవాదితో సంబంధాలు: గుజరాత్ ముఖ్యమంత్రి ఆరోపణ
- ఆరోపించిన గుజరాత్ ముఖ్యమంత్రి
- వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
- ఆరోపణలను ఖండించిన అహ్మద్ పటేల్
ఉగ్రవాద ఐసిస్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్‌కు సంబంధాలున్నాయని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆరోపించారు. రెండు రోజుల క్రితం గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు ఐసిస్‌తో సంబంధం ఉన్నట్లు భావించి అరెస్టు చేసిన ఇద్దరు అనుమానితుల్లో ఒకరికి అహ్మద్ పటేల్ ఉద్యోగమిచ్చారని ఆయన అన్నారు. దీంతో వెంటనే పటేల్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని విజయ్ రూపానీ డిమాండ్ చేశారు. అయితే.. ఈ ఆరోపణలను అహ్మద్ పటేల్ తీవ్రంగా ఖండించారు.
అనుమానితుల్లో ఒకరైన ఖాసీం స్టింబర్వాల సర్దార్ పటేల్ ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. ఆ ఆసుపత్రికి కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. అరెస్టు అవడానికి రెండు రోజుల ముందే ఖాసీం ఉద్యోగానికి రాజీనామా చేశాడని రూపానీ పేర్కొన్నారు. ‘ఆ ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. పటేల్, రాహుల్‌గాంధీ దీనిపై తప్పకుండా వివరణ ఇచ్చుకోవాలి. రాజ్యసభ సభ్యత్వం నుంచి పటేల్ వైదొలగాలి. అటువంటి వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇచ్చారనే విషయాన్ని పటేల్ చెప్పాలి’ అని రూపానీ డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణలపై అహ్మద్ పటేల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ఏటీఎస్ అధికారులు ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేయడాన్ని మా పార్టీ అభినందిస్తుంది. వారిపై విచారణ జరిపి కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే బీజేపీ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవి. ఇవి జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలు. వీటిని రాజకీయం చేయొద్దు’ అని ఆయన ట్వీట్ చేశారు. డిసెంబర్ 9, 14న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పటేల్‌పై ఇటువంటి ఆరోపణలు రావడం గమనార్హం.