North korea: ఉత్తర కొరియా పరీక్షిస్తున్న క్షిపణులు ఏయే ప్రాంతాన్ని తాకుతాయో తెలుసా?
- 9 నెలల్లో 15 క్షిపణి పరీక్షలు చేసిన ఉత్తర కొరియా
- ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలను చేరుకోగలిగే సత్తా
- ఏబీసీ న్యూస్ పరిశోధనలో తేలిన నిజం ఇదీ..
ఉత్తర కొరియా.. కిమ్ జాంగ్ ఉన్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోజూ వార్తల్లో ఉండే పేర్లివి. అణు పరీక్షలతో, హెచ్చరికలతో అమెరికాను రెచ్చగొడుతున్న నార్త్ కొరియా చీఫ్ కిమ్ గత తొమ్మిది నెలల్లో ఏకంగా 15 పరీక్షలు నిర్వహించారు. వీటిలో చాలా వరకు విజయవంతమయ్యాయి. ఉత్తర కొరియా పరీక్షించిన క్షిపణుల్లో కొన్ని జపాన్ మీదుగా ప్రయాణించాయి. సెప్టెంబరులో నిర్వహించిన అణు పరీక్షతో చైనా సరిహద్దు వెంబడి భూమి కంపించింది.
అమెరికాపై యుద్ధం ప్రకటించిన కిమ్ వద్ద న్యూయార్క్‌ను చేరుకునే క్షిపణి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తర కొరియా నిర్వహిస్తున్న క్షిపణి పరీక్షలతో ఇప్పుడు సరికొత్త ప్రశ్న ఉదయిస్తోంది. కిమ్ పరీక్షిస్తున్న క్షిపణులు నిజంగానే అమెరికా, బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలను చేరుకోగలవా? అన్నదే ఆ ప్రశ్న. దీనికి సమాధానంగా కొన్ని న్యూస్ ఏజెన్సీలు పరిశోధన చేసి కొన్ని విషయాలు వెల్లడించాయి. అందులో భాగంగా ఏబీసీ న్యూస్ చెప్పింది ఇదీ..
ఉత్తర కొరియా పరీక్షించిన స్కడ్ (సిరీస్ ఆఫ్ టాక్టికల్ మిసైల్) రేంజ్ జపాన్‌లోని ఒసాకాను, దక్షిణా కొరియాను తాకే సామర్థ్యం ఉంది. మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఈ క్షిపణుల పరిధిలోకి టోక్యోతోపాటు జపాన్‌లోని ఇతర నగరాలు వస్తాయి. ఈశాన్య చైనా, తూర్పు మంగోలియా, ఆగ్నేయ రష్యాలు వస్తాయి. ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లు చైనాలోని చాలా నగరాలను ధ్వంసం చేయగలవు. అలాగే తూర్పు రష్యా, ఆగ్నేయాసియాలోని థాయిలాండ్, ఫిలిప్పైన్స్, అమెరికాలోని గువామ్లను చేరుకునే శక్తి ఉంది.
ఖండాంతర క్షిపణులు చాలా వరకు మధ్య ప్రాచ్య దేశాలు, ఈశాన్య ఇటలీ, స్కాట్లాండ్, పశ్చిమ ఇంగ్లండ్, ఈశాన్య ఈజిప్ట్, పశ్చిమ సోమాలియా, అలస్కా, అమెరికా, కెనడా, ఇండియా, తూర్పు యూరోప్, టర్కీ, గ్రీస్, స్కాండనేవియా, ఆస్ట్రేలియాలో చాలా వరకు నగరాలను ధ్వంసం చేయగలవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉత్తరకొరియా వద్ద నున్న పలు రకాల క్షిపణులు ప్రతీ దేశంలోని ఏదో ఒక మూలను తాకే సామర్థ్యం ఉన్నవే.