Kohli: కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. రికార్డులు సృష్టించుకుంటూ పోతున్న టీమిండియా సారథి!
- కెప్టెన్‌గా ఒకే కేలండర్ ఇయర్లో ఆరు సెంచరీలు
- సారథిగా అత్యధిక సెంచరీలు చేసిన వారిలో మూడోవాడిగా ఘనత
- నిన్నటి మ్యాచ్‌లో మూడు రికార్డులు
రికార్డుల రారాజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది. రికార్డులను 'సరి'చేసుకుంటూ, మరోపక్క కొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు పోతున్న కోహ్లీ ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో రెండు రికార్డులు నెలకొల్పాడు. అందులో ఒకటి అతి తక్కువ వన్డేల్లో 9 వేల పరుగులు సాధించిన రికార్డు కాగా, ఇంకోటి కెప్టెన్‌గా ఒకే ఏడాది ఆరు సెంచరీలు బాదిన రికార్డు.
ఇక నిన్నటి మ్యాచ్‌లో వన్డేల్లో 32వ శతకం నమోదు చేసిన కోహ్లీ అదే సమయంలో ఒకే కేలండర్ ఇయర్లో కెప్టెన్‌గా ఆరు సెంచరీలు చేసిన రికార్డు నెలకొల్పాడు. అలాగే కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన మూడో క్రికెటర్‌గా తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకున్నాడు. సారథిగా 93 ఇన్నింగ్స్‌లలో 20 సెంచరీలు చేసిన కోహ్లీ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ తర్వాతి స్థానాల్లో నిలిచాడు. రికీపాంటింగ్ కెప్టెన్‌గా 41 సెంచరీలు చేయగా, గ్రేమ్ స్మిత్ 33 శతకాలు నమోదు చేశాడు. ఇప్పుడు వారి తర్వాతి స్థానంలో 20 సెంచరీలతో కోహ్లీ నిలిచాడు.