car chase: కార్ ఛేజ్‌తో అమెరికా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన పదేళ్ల బాలుడు... వీడియో చూడండి
- 72 కి.మీ.లు వరకు కారు నడిపిన బాలుడు
- ఒకానొక సమయంలో గంటకు 162 కి.మీ. వేగంతో కారు నడిపిన బాలుడు
- ఇలా చేయడం ఇదో రెండోసారి
అమెరికాలో నివసించే వారికి కారు ఉండటం చాలా సాధారణం. అందుకే చిన్న వయసు నుంచే కారు డ్రైవింగ్ వాళ్లకు వచ్చి ఉంటుంది. డ్రైవింగ్ అంటే ఇష్టమో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్ ప్రాంతానికి చెందిన ఓ పదేళ్ల బాలుడు తన తల్లి బాయ్‌ఫ్రెండ్ కారు తీసుకుని పారిపోయాడు. తన చెల్లి పాఠశాలకు సిద్ధమవుతుండగా ఆ బాలుడు ఒక్కడే కారులో ఒంటరిగా ఉన్నాడు. ఏమైందో ఏమో ఒక్కసారిగా కారు స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతని వెనకాలే వేరే కారులో తల్లి కూడా బయల్దేరింది. అప్పుడే 911కి ఫోన్ చేసి విషయం తెలియజేసింది.
దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇది నచ్చని ఆ బాలుడు కారు వేగం పెంచాడు. ఒకానొక సమయంలో గంటకు 162 కి.మీ.ల వేగంతో కారు నడిపాడు. వాకీ టాకీల ద్వారా ఆ హైవే మీద గస్తీ కాసే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు కారు దారిలో అడ్డంకులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయగా బాలుడు కారును రోడ్డు మీద నుంచి కిందకి దింపేశాడు. తర్వాత ఒక గుంతలో కారు ఇరుక్కుపోవడంతో పోలీసులకు దొరికిపోయాడు.
దాదాపు 72 కి.మీ.ల దూరం వరకు తాము వెంబడించిన పదేళ్ల కుర్రాణ్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. కారు ఆగినా బాలుడు బయటకు రావడానికి నిరాకరించడంతో పోలీసులు బలవంతంగా బయటికి లాగారు. అయితే బాలుడు ఇలా చేయడం ఇది రెండోసారని తెలుస్తోంది. అక్టోబర్ 16వ తేదీన కూడా ఇంట్లో బోరు కొడుతోందని తన తల్లి కారు తీసుకుని ఓ రైడ్‌కి వెళ్లొచ్చినట్లు సమాచారం.