saree: ‘ఆఫీసుకి చీర ధరించి వెళ్తే సమస్యలివే!’ అంటూ వీడియో పోస్ట్ చేసిన ఇండియా టుడే... హితబోధ చేసిన నెటిజన్లు
- చీర ధరించి ఆఫీసుకి వెళ్తే ఎదుర్కోవాల్సిన కష్టాలు వివరిస్తూ వీడియో
- సెన్సేషనలిజం కోసం చీప్ ట్రిక్ అన్న నెటిజన్లు
- భారతీయ సంస్కృతిని ఉదహరిస్తూ కామెంట్లు
వార్తా ఛానళ్ల మధ్య పోటీ ఎక్కువ కావడంతో సెన్సేషనలిజం కోసం ఏదో ఒక అడ్డదారి తొక్కుతున్నారు. అందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. అలాంటి పనినే ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్ 'ఇండియా టుడే' కూడా చేసింది. 'ఆఫీసుకి చీర ధరించి వెళ్తే ఎదుర్కునే సమస్యలివే!' అంటూ ఓ వీడియో రూపొందించి తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోను మెచ్చుకున్న వారి కంటే తిట్టిన వారే ఎక్కువ ఉన్నారు. ఏదైతేనేం ఎలాగోలా పబ్లిసిటీ దొరికింది కదా!... అని ఆ ఛానల్ సంబరపడుతున్నట్లుంది. అందుకే వీడియోను ఇంకా డిలీట్ చేయలేదు. కనీసం కామెంట్లను ఖండిస్తూ, లేదా క్షమాపణ కోరుతూ వివరణ కూడా ఇవ్వలేదు.
చీర కట్టుకుని ఆఫీసుకి వెళ్తే సరిగా నడవడం కష్టం, అందరూ పెళ్లయిందా? అని అడుగుతారు, ఆంటీ అని పిలుస్తారు, పురుష ఉద్యోగులు గుచ్చి గుచ్చి చూస్తారు వంటి సమస్యలను వీడియోలో ఏకరువు పెట్టింది. అయితే దీనిపై మండిపడుతూ నెటిజన్లు కామెంట్లు చేసి వారికి హితబోధ చేశారు. 'మీరు ఏం జర్నలిస్టులు.. భారతీయ సంస్కృతిని కించపరుస్తారా?', 'మీ ఆఫీసులో అలా ఉండొచ్చు.. అన్ని చోట్లా కాదు', 'చీరల్లో ఆఫీసుకి వెళ్లి ఇస్రో సైంటిస్టులు మార్స్ మిషన్ పూర్తి చేశారు... టాలెంట్, పనితనం ముఖ్యం.. వేషధారణ కాదు' అంటూ కామెంట్లు చేశారు.