akshay kumar: అక్షయ్ కుమార్, మల్లికా దువా వివాదంపై స్పందించిన ట్వింకిల్ ఖన్నా
- భర్తకు మద్దతుగా మాట్లాడిన ట్వింకిల్
- వివాదంలోకి తనను లాగొద్దని మనవి
- హాస్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని వ్యాఖ్య
'స్టార్‌ప్లస్' ఛానల్లో ప్రసారమవుతున్న 'ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్' కార్యక్రమంలో సూపర్ జడ్జి అక్షయ్ కుమార్ వాడిన పదజాలం ఇబ్బందికరంగా ఉందంటూ జూనియర్ జడ్జి మల్లికా దువా ఫేస్బుక్లో వీడియో పెట్టిన సంగతి తెలిసిందే.
'మీరు గంట బజాయిస్తే.. నేను మిమ్మల్ని బజాయిస్తాను' అని అక్షయ్ అనడం ఈ వీడియోలో ఉంది. అయితే అక్షయ్ మాటలను తప్పుగా అర్థం చేసుకుని, 'పని చేసే చోట మగాళ్ల అకృత్యాలు' అంటూ మల్లిక పోస్ట్ పెట్టింది. దీనిపై ఆమె తండ్రి, ప్రముఖ జర్నలిస్టు వినోద్ దువా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అక్షయ్ అంతు చూస్తానని అతడు పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ వివాదం కాస్తా రచ్చకెక్కడంతో అక్షయ్‌ను రక్షించడానికి అతని భార్య ట్వింకిల్ ఖన్నా రంగంలోకి దిగింది. అక్షయ్‌కి మద్దతుగా ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది.
'లాఫ్టర్ ఛాలెంజ్ షూటింగ్లో జరిగిన వివాదం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆ కార్యక్రమంలో కంటెస్టంట్ ప్రదర్శన బాగా నచ్చితే గంట మోగించాలి. అందులో భాగంగా మిస్ దువా గంట మోగించబోయింది. అప్పుడు 'మల్లికా గారు.. మీరు గంట బజాయిస్తే.. నేను మిమ్మల్ని బజాయిస్తాను' అని అక్షయ్ అన్నాడు. ఈ సన్నివేశంలో కామెడీని పండించడానికే మిస్టర్ కుమార్ అలా అన్నాడు. 'బజాయించడం' అనే పదం చాలా కామన్. యువతీ యువకులు సాధారణంగా వాడుతూనే ఉంటారు.
అంతెందుకు, ప్రముఖ రేడియో స్టేషన్ రెడ్ ఎఫ్ఎం వారి ట్యాగ్‌లైన్ కూడా 'బజాతే రహో'... అక్కడ తప్పుగా అనిపించని పదాన్ని మిస్ దువా, ఆమె తండ్రి మిస్టర్ దువా ఇక్కడ తప్పు దృష్టితో ఎందుకు చూస్తున్నారు? హాస్యంలో భాగంగా వాడిన పదాలను హాస్యంగానే చూడాలి. కామెడీని కొత్తపుంతలు తొక్కించిన ఏఐబీ సంస్థకు నేను ఎన్నోసార్లు మద్దతు పలికాను. ఈ వివాదంలోకి నన్ను లాగొద్దు` అని ట్వింకిల్ ట్వీట్ చేసింది.
కామెడీకి బూతును జోడించి `ఏఐబీ నాకౌట్` పేరుతో ఏఐబీ సంస్థ ఓ కార్యక్రమం నిర్వహించింది. అప్పట్లో ఆ కార్యక్రమం వివాదాస్పదమైంది. చాలా మంది సినీ పెద్దలు ఏఐబీకి మద్దతు తెలిపారు. ఆ తర్వాత ఏఐబీ తీసిన కొన్ని వీడియోల్లో మల్లికా దువా నటించింది. ఆ నటనలో భాగంగా ఆమె చాలా సార్లు బూతులను బహిర్గతంగానే ఉపయోగించింది.