Mamata Banerjee: ఆధార్‌పై మీరు పిటిషన్ వేయడం ఏంటీ?: మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాక్
- కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్రాలు పిటిషన్ ఎలా వేస్తాయి?
- ప్రజలు మాత్రమే పిటిషన్ వేయాలి
- మమతా బెనర్జీ తరఫు న్యాయవాది వాదనలపై న్యాయస్థానం అసంతృప్తి
అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా 'అన్నింటికీ ఆధార్ అనుసంధానం' నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ సర్కారుతో పాటు ఈ విషయంపై వచ్చిన పిటిషన్లపై ఈ రోజు విచారణ జరిపిన సుప్రీంకోర్టు మమతా బెనర్జీకి షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్రాలు పిటిషన్ ఎలా వేస్తాయని ప్రశ్నించింది. దీనిపై తగిన వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
మమతా బెనర్జీ ప్రభుత్వం తరఫున వాదనలు జరిపిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ పేర్కొన్న విషయాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పౌరులు పిటిషన్ వేయవచ్చని, అంతేగానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు వేయకూడదని వివరించింది. అలాగే మొబైల్ నంబర్‌కు ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న నిబంధనపై ఇతరులు వేసిన పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు... దీనిపై నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదేశించింది. అలాగే ఈ విషయంపై టెలికాం ఆపరేటర్లు కూడా తమ స్పందన తెలపాలని సూచించింది.