revant reddy: కాంగ్రెస్ పార్టీలో చేరుదామా? అని ప్రశ్నించిన రేవంత్.. హర్షధ్వానాలతో ఆమోదం తెలిపిన అభిమానులు, అనుచరులు!

  • దేశ భ‌ద్రత కోసం ప‌నిచేసిన ఓ సైనికుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి  
  • అలాంటి వ్య‌క్తి నాయ‌క‌త్వంలో పోరాడ‌దాం
  • నేను ఉత్త‌మ్ కుమార్ అన్న‌తో చేయి క‌ల‌ప‌వ‌చ్చా?
  • అభిమానులను, అనుచరులను అడిగిన రేవంత్ 

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాళ్ల కింద చెప్పుల్లా, తలపైన గొడుగులా ప్ర‌జ‌లు ఉండ‌ద‌ల్చుకోవ‌డం లేద‌ని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రోజు హైద‌రాబాద్‌లో రేవంత్ రెడ్డి తన ఇంటివద్ద అభిమానులు, అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దేశ భ‌ద్రత కోసం ప‌నిచేసిన ఓ సైనికుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అని రేవంత్ రెడ్డి అన్నారు.

 'ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నాయ‌క‌త్వంలో మనమంతా ప‌నిచేద్దామా?  కాంగ్రెస్ పార్టీలో చేరుదామా? నేను ఉత్త‌మ్ కుమార్ అన్న‌తో చేయి క‌ల‌ప‌వ‌చ్చా?' అంటూ రేవంత్ అడిగారు. దీనికి ఆయన అభిమానులు, అనుచరులు పెద్ద పెట్టున హర్షం వ్యక్తం చేస్తూ ఆమోదం తెలిపారు. అనంత‌రం ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో చేయి క‌లిపి, తెలంగాణ స‌మాజం కేసీఆర్‌తో క‌ల‌బ‌డ‌డానికి సిద్ధ‌మైంద‌ని అన్నారు. జై కాంగ్రెస్ అని నినాదాలు చేశారు.

కాగా, పుస్త‌కాలు ప‌క్కన పెట్టి ఓయూ విద్యార్థులు ఉద్య‌మంలోకి దిగితే ఎవ్వ‌రైనా దిగి రావాల్సిందేన‌ని ఆ రోజు మాట్లాడిన కేసీఆర్‌.. ఇప్పుడు మ‌రోలా మాట్లాడుతున్నార‌ని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్య‌మాన్ని న‌డిపించిన‌ టీజేఏసీని, విద్యార్థుల‌ను కేసీఆర్ ఇప్పుడు ప‌క్క‌న పెట్టేశార‌ని తెలిపారు. 2009లో తెలంగాణ ఉద్య‌మం ఉద్ధృత‌మైందని, జూన్ 2, 2014 రోజున కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఏపీలో న‌ష్టం వ‌స్తుంద‌ని తెలిసినా తెలంగాణ ఇచ్చారని, రాష్ట్రం ఏర్ప‌డింద‌ని వ్యాఖ్యానించారు.

ఆరు ద‌శాబ్దాల తెలంగాణ ప్ర‌జ‌ల‌ క‌ల‌ను సోనియా గాంధీ గుర్తించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామ‌ని, ఎన్నో ఆకాంక్ష‌ల‌తో ఎన్నో ఆశ‌ల‌తో చేసిన‌ పోరాటాల‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిందని వ్యాఖ్యానించారు. ఉద్య‌మంలో పాల్గొన్న యువ‌త గురించి కేసీఆర్ ఆలోచించ‌డం లేదని, ఆత్మ‌ బ‌లిదానాలు చేసుకున్న వారి సాక్షిగా ఏర్ప‌డ్డ తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డం లేద‌ని చెప్పారు. రైతుల‌కు, విద్యార్థుల‌కు, గిరిజ‌నుల‌కు, మైనార్టీల‌కు ఇచ్చిన మాట‌ను కేసీఆర్ నిల‌బెట్టుకోవ‌డం లేద‌ని తెలిపారు. ఇలా చెప్పుకుంటే పోతే కేసీఆర్ ఎన్నిక‌ల మానిఫెస్టోలో చెప్పుకున్న ఏ అంశాన్నీ నెర‌వేర్చ‌లేద‌ని అన్నారు.  

  • Loading...

More Telugu News