chandrababu: సీఎం రమేష్ సోదరుడు, కాంట్రాక్టర్ సీఎం రాజేష్ పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం... పోలీసులను పంపుతానని హెచ్చరిక!
- ప్రాజెక్టులపై చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
- గండికోట పనులు చేస్తున్న సీఎం రాజేష్
- వీడియో కాన్ఫరెన్స్ కు గైర్హాజరు
- నత్తనడకన సాగుతున్న పనులు
- పోలీసు చర్యలకు సిఫార్సు చేస్తానన్న చంద్రబాబు
తాను నిత్యమూ అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తుంటే, తనను మించి శ్రమించాల్సిన వారు అశ్రద్ధతో ఉన్నారని, ఇంత నిర్లక్ష్యాన్ని ఇకపై సహించేది లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మధ్యాహ్నం రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పనులను సమీక్షిస్తున్న వేళ, గండికోట ప్రాజెక్టుకు వచ్చేసరికి గుత్తేదారు, పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనక పోవడం చంద్రబాబుకు కోపాన్ని తెప్పించింది.
గండికోట పనులు అనుకున్నట్టుగా సాగడం లేదని, పనుల్లో జాప్యం జరిగితే తాను సహించబోనని హెచ్చరిస్తూ, ఇదే వైఖరి కొనసాగితే, తాను పోలీసు చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రాజెక్టు సైట్ కు పోలీసులను పంపి అక్కడి సామాగ్రిని స్వాధీనం చేసుకుంటానని అన్నారు. ఇరిగేషన్ పనుల విషయంలో మాత్రం జాప్యాన్ని ఎంతమాత్రమూ సహించేది లేదని, ఎలాంటి వారినైనా ఉపేక్షించబోనని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.