Reliance: రూటు మార్చిన జియో.. ఫీచర్ ఫోన్ల తయారీకి స్వస్తి.. ఎయిర్‌టెల్‌కు కౌంటర్
- ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీ బాటలో జియో
- గూగుల్‌తో చర్చలు..
- ఎయిర్టెల్ వ్యూహాలకు చెక్
ఉచిత 4జీ ఫీచర్ ఫోన్‌తో మార్కెట్లోకి దూసుకొచ్చి ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించిన రిలయన్స్ జియో అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వినియోగదారులకు పంపిణీ చేసిన 4 జీ ఫీచర్ ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది. వాటి స్థానంలో ఆండ్రాయిడ్ ఆధారిత 4జీ ఫోన్లు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు గూగుల్‌తో చర్చలు జరుపుతోంది.
ప్రస్తుతం జియో నుంచి వచ్చిన 4జీ ఫీచర్ ఫోన్ ‘కై’ ఓఎస్‌తో పనిచేస్తుండడం, ఎక్కువ యాప్స్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు లేకపోవడం, ఆండ్రాయిడ్ ఫోన్లకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని కొత్త వెర్షన్ల అభివృద్ది కోసం జియో యోచిస్తున్నట్టు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, జియో 4జీ ఫోన్ ప్రీ-బుకింగ్‌కు అనూహ్య స్పందన లభించింది. బుకింగ్ మొదలైన గంటల్లోనే 60 లక్షల ఫోన్లు బుక్ అవడంతో బుకింగ్ నిలిపివేసింది. ఇటీవలే వీటి పంపిణీని పూర్తి చేసింది. జియో ఫోన్‌కు పోటీగా ఎయిర్టెల్ మొబైల్ తయారీ కంపెనీలతో చేతులు కలిపి అతి తక్కువ ధరకు 4జీ స్మార్ట్ ఫోన్లు తెస్తుండడంతో ఉలిక్కి పడిన జియో తాను కూడా ఆండ్రాయిడ్ ఫోన్లతో ముందుకు రావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తద్వారా ఎయిర్టెల్ వ్యూహాలకు చెక్ చెప్పాలని యోచిస్తోంది.