shivsena: సీఎం ఫడ్నవిస్ కు దీటుగా సమాధానమిచ్చిన శివసేన
- కలసి ఉంటారో? లేదో? తేల్చుకోవాలన్న ఫడ్నవిస్
- పొత్తు వద్దనుకుంటే వదిలేయాలన్న శివసేన
- రెండు పార్టీల మధ్య పెరుగుతున్న అగాథం
మహారాష్ట్రలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటారో? లేదో? తేల్చుకోవాలంటూ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ విసిరిన సవాలుకు శివసేన అదే స్థాయిలో సమాధానమిచ్చింది. తమతో పొత్తు అవసరంలేదు అనుకుంటే... నిరభ్యంతరంగా వదిలేయవచ్చు అంటూ తన అధికార పత్రిక సామ్నాలో పేర్కొంది.
మరోవైపు రానున్న శాసనసభ శీతాకాల సమావేశాల్లోపు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుందనే వార్తల నేపథ్యంలో, ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. రెండు పార్టీల మధ్య స్నేహం తెగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. దీన్ని బలపరిచేలా... పార్టీ నేతల కామెంట్లు కూడా ఉంటున్నాయి.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సమయం చిక్కినప్పుడల్లా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశాన్ని నడిపించగల సమర్థత రాహుల్ గాంధీకి ఉందంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య విభేదాలను మరింత పెంచాయి. ఈయన వ్యాఖ్యల నేపథ్యంలోనే శివసేనకు ఫడ్నవిస్ సవాల్ విసిరారు. దీనికి కౌంటర్ గా శివసేన ఘాటుగా స్పందించింది.