china: చైనా ఘనత.. 'డెత్ జోన్'లో ఎగరగలిగే డ్రోన్ల తయారీ!
- నియర్ స్పేస్ లోకి డ్రోన్ ను పంపిన చైనా
- ప్రతిబంధకాలను అధిగమించిన డ్రోన్
- మిలిటరీ నిఘా కోసం వాడుకోనున్న చైనా
అత్యాధునిక హై-ఆల్టిట్యూడ్ నిఘా డ్రోన్లను చైనా విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయంతో భూమి సాధారణ వాతావరణం ముగిసే ప్రాంతంపై (నియర్ స్పేస్) చైనా ఆధిపత్యం కొనసాగనుంది. సముద్రమట్టానికి 20 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ నియర్ స్పేస్ వస్తుంది. ఇంత ఎత్తులో గాలి చాలా పలుచగా ఉంటుంది. సాధారణంగా గాలి పలుచగా ఉన్న చోట్ల డ్రోన్లు ఎగరలేవు. ఈ హై-ఆల్టిట్యూడ్ ప్రాంతాన్ని 'డెత్ జోన్'గా కూడా పిలుస్తుంటారు.
ఈ ఎత్తులో గాలి పలుచగా ఉండటం వల్ల... డ్రోన్లు ఎగరడానికి అవసరమైన పరిస్థితి ఉండదు. అంతేకాదు, ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో, డ్రోన్లలోని ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాటరీలు కూడా ఫెయిల్ అవుతాయి. అయినప్పటికీ, ఈ సమస్యలన్నింటినీ అధిగమించి, చైనా తన డ్రోన్ ను విజయవంతంగా పరీక్షించింది. ఈ డ్రోన్లను మిలిటరీ ఇంటెలిజెన్స్ అవసరాలకు చైనా వాడుకుంటుందని హాంకాంగ్ నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్న 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' పేర్కొంది. ఉపగ్రహాలతో పోలిస్తే అత్యంత తక్కువ ఖర్చుతో తయారైన ఈ డ్రోన్లు... చాలా క్లారిటీతో కూడిన ఫొటోలను తీసి, గ్రౌండ్ స్టేషన్ కు పంపుతాయి.
నిఘా విభాగాలకు నియర్ స్పేస్ చాలా కాలంగా అత్యంత ప్రాధాన్యత గల ప్రాంతంగా కొనసాగుతోంది. అయితే, చాలా ఎయిర్ క్రాఫ్ట్ లకు అంతపైకి ఎగిరి, పని చేయడం సాధ్యం కాకపోవడం వల్ల, ఈ రకమైన వ్యవస్థలు ఎక్కువగా అభివృద్ధి చెందలేకపోయాయి. నియర్ స్పేస్ వెహికల్స్ ద్వారా భూమిపై ఉన్న పెద్ద ప్రాంతాలపై వారాల నుంచి సంవత్సరాల వరకు నిఘా ఉంచాలనే లక్ష్యంతో సైంటిస్టులు పని చేస్తున్నారు.
చైనా పరిక్షించిన ఈ డ్రోన్ ఒక క్రికెట్ బ్యాట్ సైజులో ఉంటుంది. ఎలక్ట్రో మాగ్నెటిక్ పల్స్ ను ఉపయోగించి దీన్ని లాంచ్ చేశారు. దీని వేగాన్ని గంటకు సున్నా నుంచి 100 కిలోమీటర్లకు ఇన్స్టంట్ గా పెంచారు.
ఈ లాంచ్ గురించి ప్రాజెక్ట్ లీడ్ సైంటిస్ట్ యాంగ్ యాంచు మాట్లాడుతూ, డ్రోన్ ఒక బుల్లెట్ లా దూసుకుపోయిందని చెప్పారు. 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ డ్రోన్లు తమ లక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. మనిషి సహాయం అవసరం లేకుండానే పనిని చక్కబెట్టేస్తాయి. ఒకేసారి ఇలాంటి వందలాది డ్రోన్లను లాంచ్ చేయాలనేదే తమ రీసెర్చ్ లక్ష్యమని ఈ సందర్భంగా యాంగ్ తెలిపారు.