janareddy: హరీశ్‌రావుపై భారీ పంచ్ వేసి.. అసెంబ్లీలో నవ్వులు పూయించిన జానారెడ్డి!
- రైతులపై కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది: హరీశ్‌రావు
- రైతుల గురించి చర్చించేటప్పుడు కాంగ్రెస్ నేతలు సభలో లేరు
- రైతుల గురించి చర్చించేటప్పుడు సీఎం కేసీఆర్ కూడా లేరు: జానారెడ్డి
- రైతులపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది
తెలంగాణ అసెంబ్లీలో రైతుల సమస్యలపై స్వల్పకాలిక చర్చ కొనసాగుతోంది. సభలో మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు... కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుబట్టాలని చూశారు. రైతులపై కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందని అన్నారు. సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూర్చున్న వైపునకు ఒక్కసారి తిరిగి చూస్తే ఈ విషయం అర్థమైపోతుందని చెప్పారు. రైతుల సమస్యల గురించి మాట్లాడడానికి జీవన్ రెడ్డి సభలో లేకుండా పోయారని, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ కనపడడం లేదని అన్నారు. రైతులపై వారికున్న ప్రేమ, శ్రద్ధ ఏ పాటిదో దీన్ని బట్టి అర్థమైపోతుందని చెప్పారు.
అయితే, వెంటనే హరీశ్‌రావుకి కాంగ్రెస్ పార్టీ సభ్యుడు జానారెడ్డి కౌంటర్ ఇచ్చారు. 'ఇప్పుడే హరీశ్ రావు ఒక విషయం చెప్పారు.. సభలో ప్రతి సభ్యుడు చెప్పిన విషయాన్ని మేము శ్రద్ధగా వింటున్నాం.. సభలో ఇంతటి ముఖ్యమైన విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు సీఎం కేసీఆర్ లేరు. రైతులపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది' అని ఎద్దేవా చేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీల సభ్యులంతా నవ్వేశారు.
కాగా, రైతు రుణమాఫీ, కనీస మద్దతు ధరపై కేసీఆర్ సర్కారు తీరు బాగోలేదని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహ్యతకు పాల్పడుతున్నారని చెప్పారు. నకిలీ విత్తనాల విక్రయదారులపై ఏ చర్యలు తీసుకున్నారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సభలో నిలదీశారు.