wedding: పెళ్లికి విచ్చేసిన అతిథులతో అవయవ దానానికి ఒప్పించిన దివ్యాంగుల జంట!
- ముందుకు వచ్చిన 82 మంది అతిథులు
- పెళ్లి వేడుకలోనూ అవయవ దానం గురించి ప్రచారం
- ఆదర్శంగా నిలిచిన దివ్యాంగుల జంట
హర్యానాలోని సోనెపట్‌లోని గారీ బ్రాహ్మణ్ గ్రామానికి చెందిన శివాని, ఢిల్లీకి చెందిన అశ్వనిలు మంగళవారం పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ దివ్యాంగులే. ఇందులో ప్రత్యేకత ఏముందీ అనుకుంటున్నారా... అవయవదానం ఇతివృత్తంగా తమ పెళ్లి, రిసెప్షన్ వేడుకలను జరుపుకుందీ దివ్యాంగ జంట.
మంగళవారం జరిగిన రిసెప్షన్‌లో అవయవదానానికి సిద్ధపడుతూ శివాని, అశ్వనిలు పత్రాలపై సంతకాలు చేశారు. అంతేకాకుండా వేడుకకు హాజరైన 82 మంది అతిథుల చేత కూడా అవయవదాన పత్రాలపై సంతకాలు చేయించారు. పెళ్లికూతురు శివాని తరఫున 52 మంది, పెళ్లికొడుకు అశ్వని తరఫున 30 మంది బంధువులు అవయవదానానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
అవయవాలు దానం చేసే వారు లేక తన స్నేహితురాలు చనిపోవడాన్ని ప్రత్యక్షంగా చూసినప్పటి నుంచి శివాని అవయవదానం ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తోంది. ఈ కార్యక్రమంలో తనకు మద్దతిస్తానని మాట ఇచ్చినందుకే అశ్వనిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నట్లు శివాని తెలిపింది.