application: ప్రజలకు ఉపయోగంగా ఉండటం కోసం తన పేరుతో యాప్ విడుదల చేసిన కర్ణాటక సీఎం
- యాప్ పేరే 'సిద్ధరామయ్య'
- ఆండ్రాయిడ్, ఆపిల్ ప్లేస్టోర్ల నుంచి డౌన్‌లోడ్
- ఇది ముఖ్యమంత్రి యాప్ అంటూ వ్యాఖ్య
ముఖ్యమంత్రికి, ప్రజలకి మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరిచేందుకు కర్ణాటక ప్రభుత్వం టెక్నాలజీ సాయం తీసుకుంది. స్వయంగా ముఖ్యమంత్రి పేరుతో ఓ మొబైల్ అప్లికేషన్ తయారు చేసి విడుదల చేసింది. `సిద్ధరామయ్య` అనే పేరుతో ఉన్న ఈ యాప్ ద్వారా ప్రజలు తమ సమస్యలను సరాసరి ముఖ్యమంత్రితో పంచుకోవచ్చు. అలాగే ప్రభుత్వ పాలనకు సంబంధించి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు కూడా చేయవచ్చు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఆపిల్ ప్లేస్టోర్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ యాప్‌ను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య... 'ఇది ముఖ్యమంత్రి యాప్. పౌరులు తమ ముఖ్యమంత్రితో మాట్లాడటానికి ఇదొక్కటే సరైన దారి. ప్రభుత్వ పథకాల సమాచారం, ప్రజా సమస్యల పరిష్కారం వంటివన్నీ ఈ యాప్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు. ఈ డిజిటల్ యుగంలో కంప్యూటర్లలాగ పనిచేసే స్మార్ట్‌ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి. వాటిలో యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ప్రభుత్వాన్ని నడిపించండి' అన్నారు. ఈ సందర్భంగా ఆయన మరో యాప్‌ను కూడా విడుదల చేశారు. రాష్ట్రంలోని పంట భూముల వివరాలను కచ్చితంగా సేకరించడం కోసం, జియో రిఫరెన్సింగ్ విధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ యాప్‌ను ఉపయోగించనున్నట్లు ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కృష్ణ బైరె గౌడ తెలిపారు.