tirumala: తిరుమల దివ్యారామం మలుపులో విరిగిన కొండచరియలు... భారీగా నిలిచిన ట్రాఫిక్
- హుటాహుటిన చేరుకున్న అధికారులు
- లింక్ రోడ్డు ద్వారా ట్రాఫిక్ మళ్లింపు
- వాహనాలు లేకపోవడంతో తప్పిన ప్రమాదం
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే కనుమ దారిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దివ్యారామం మలుపు వద్ద పైనుంచి పెద్ద పెద్ద బండరాళ్లు పడటంతో, ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని, ట్రాఫిక్ ను రెండు కనుమ దారులకూ మధ్య ఉండే లింక్ రోడ్డుకు మళ్లించారు. సాధ్యమైనంత త్వరగా విరిగి పడిన కొండ చరియలను తొలగిస్తామని అధికారులు తెలిపారు. రాళ్లు పడేముందు ఆ ప్రదేశంలో వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనతో చాలా సేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.