winter: చంపేస్తున్న చలిపులి... 17, 16 డిగ్రీల నుంచి 12 డిగ్రీలకు!
- ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రత్తలు
- రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించడమే కారణం
- కొన్ని ప్రాంతాల్లో ఉదయం 9 గంటలైనా సూర్యుడు కనిపించని పరిస్థితి
- చలి మరింతగా పెరుగుతుందన్న వాతావరణ శాఖ
తెలుగు రాష్ట్రాలను చలిపులి చంపేస్తోంది. రుతుపవనాలు వెళ్లిపోయిన తరువాత, ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు ఈ సీజన్ లో కనిష్ఠస్థాయికి పడిపోయాయి. ఐదారు రోజుల క్రితం సగటు ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలుగా ఉండగా, ఇప్పుడది పగలు 24 డిగ్రీలకు, రాత్రి పూట 16 నుంచి 17 డిగ్రీలకు పడిపోయాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా చలి ఉండే ప్రాంతమైన అరకులోయలో ఉష్ణోగ్రత 12 డిగ్రీలకు పడిపోయింది.
మోదకొండమ్మ పాదాలు, బొర్రా గుహలు తదితర ప్రాంతాల్లో ఉదయం 9 గంటలు దాటుతున్నా సూర్యుడు కనిపించని పరిస్థితి. పొగమంచు కమ్మేసిన వేళ, రహదారులపై రాకపోకలు నిదానంగా సాగుతున్నాయి. ఇక గత రాత్రి హైదరాబాద్ లో 18 డిగ్రీలు, విజయవాడలో 20 డిగ్రీలు, విశాఖపట్నంలో 21 డిగ్రీలు, నిజామాబాద్ లో 17 డిగ్రీలు, అరకులో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆకాశంలో మేఘాలు లేక నిర్మలంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.