revant: రేవంత్ నిష్క్రమణ తరువాత... తెలంగాణ సంగతి చూసేందుకు కదిలిన చంద్రబాబు!

  • నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం
  • అందుబాటులోని నేతలతో బాబు చర్చలు
  • రేవంత్ రాజీనామా లేఖపైనా సాగనున్న చర్చ

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రధానమైన నేతల్లో ఒకరైన రేవంత్ రెడ్డి, ఎనిమిది మంది జిల్లాల అధ్యక్షులు, మరో 20 మంది వరకూ నేతలతో కలసి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన తరువాత ఏర్పడ్డ పరిస్థితులను సమీక్షించేందుకు ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ కు రానున్నారు.

అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం జరిపి, తాజా పరిస్థితులను ఆయన సమీక్షించనున్నారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ సమావేశానికి పిలిచినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి రావాలని ఎల్ రమణ, కృష్ణయ్య తదితర నేతలందరికీ పిలుపులు వెళ్లాయి. ఈ మధ్యాహ్నం తరువాత సమావేశం జరగనుంది. తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలుస్తోంది.

కాగా, ఇదే సమయంలో రేవంత్ రెడ్డి తమకిచ్చిన రాజీనామా లేఖను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు పంపించాలా? వద్దా? అన్న విషయంలోనూ చర్చ సాగనుంది. ఒకవేళ స్పీకర్ కు లేఖను పంపితే, రాజీనామా చేయకుండా వైకాపా నుంచి టీడీపీలో చేరిన వారి సంగతేంటని ప్రతిపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉండటంతో ఒకటికి రెండుసార్లు చర్చించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. తమంతట తాము స్పీకర్ కు లేఖను పంపకుండా, రేవంత్ స్వయంగా మరో లేఖను తీసుకెళ్లి స్పీకర్ కు ఇచ్చే పరిస్థితి తేవాలన్నది తమ ఆలోచనని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News