bhutan: భూటాన్ యువరాజుకి ప్రధాని మోదీ ఏం బహుమతి ఇచ్చారో తెలుసా?
- ఫిఫా అండర్-17 వరల్డ్‌కప్‌లో ఉపయోగించిన ఫుట్‌బాల్
- ఇంకా ఒక చదరంగం సెట్‌ను కూడా
- ట్విట్టర్లో ఫొటోలు
భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్‌చుక్ కుటుంబసమేతంగా నాలుగు రోజుల పాటు భారత దేశ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చిన మొదటి రోజే భూటాన్ రాజు కుమారుడు, బుల్లి యువరాజు గ్యాల్సీ భారత మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించాడు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సమావేశం తర్వాత భూటాన్ రాజు కుటుంబం ప్రధాని మోదీతో భేటీ అయ్యింది. ఈ భేటీలో భాగంగా ప్రధాని మోదీ, బుల్లి యువరాజుకు బహుమతులు ఇచ్చారు.
ఇటీవల భారత్‌లో జరిగిన ఫిఫా అండర్-17 వరల్డ్‌కప్‌లో ఉపయోగించిన అధికారిక ఫుట్‌బాల్, ఒక చదరంగం సెట్‌ను కూడా ప్రధాని కానుకగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను మోదీ తన ట్విట్టర్లో పంచుకున్నారు. అలాగే భూటాన్ రాజకుటుంబాన్ని కలవడం సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఒప్పందాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌లతో వాంగ్‌చుక్ కుటుంబం సమావేశమైనట్లు సమాచారం.