revanth reddy: రేవంత్ గురించి మాట్లాడను అంటూనే.. విమర్శలు గుప్పించిన మంత్రి తలసాని
- కాంగ్రెస్ లో ఆట మొదలైంది
- పదవుల కోసం కొట్లాడుకుంటారు
- స్పీకర్ కు రాజీనామా లేఖ ఇచ్చినట్టు రేవంత్ ప్రచారం చేసుకుంటున్నారు
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. 'రేవంత్ రెడ్డి గురించి ఏమీ మాట్లాడను' అంటూనే ఆయనను విమర్శించారు. రేవంత్ రాజీనామా ఇంతవరకు స్పీకర్ కు చేరనే లేదని ఆయన అన్నారు. కానీ, నేరుగా స్పీకర్ కు రాజీనామా లేఖ ఇచ్చినట్టు రేవంత్ ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసేదేమీ లేదని... సాక్షాత్తు రాహుల్ గాంధీ వచ్చి కూర్చున్నా, వారికి ఒరిగేది ఏమీ లేదని అన్నారు. రేవంత్ చేరికతో తెలంగాణ కాంగ్రెస్ లో ఆట మొదలైందని, పదవుల కోసం ఆ పార్టీలో కొట్లాటలు జరుగుతాయని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని... 50 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తామని తలసాని చెప్పారు. గతంలోనే టీడీఎల్పీ టీఆర్ఎస్ లో విలీనం అయిందని... ఈ నేపథ్యంలో, తన రాజీనామా లేఖ అప్రస్తుతమని అన్నారు.