Chandrababu: రాజకీయాల్లో ఏమేం చేయాలో కొన్ని చెప్పకూడదు.. చెప్పి చేసేది రాజకీయం కాదు: చంద్రబాబు
- టీడీపీని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉంది
- అరచేతిలో ఏముందో అందరూ ఊహించుకునేలా చేయాలి
- చేయి చాచి చూపించకూడదు
- టీటీడీపీ కార్యకర్తలు ఏం చేయాలో చెబుతాను.. దశ, దిశ సూచిస్తాను
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్ చెప్పారని, అదే సిద్ధాంతంతో తమ పార్టీ ముందుకు వెళుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఒక్క మాట చెబితేనే ఈ రోజు జరిగిన సమావేశానికి భారీగా కార్యకర్తలు వచ్చారని అన్నారు.
ప్రతి కార్యకర్త పని చేయాల్సిన అవసరం ఉందని, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లండని పిలుపునిచ్చారు. కార్యకర్తలతో మాట్లాడితే తనకు ఆనందంగా ఉంటుందని అన్నారు. తనను నెలకొకసారి హైదరాబాద్కు రావాలని, పార్టీ విషయాల గురించి చర్చించాలని టీటీడీపీ నేతలు కోరారని, తనకు వీలైనంత మేరకు ఇక్కడకు వస్తూనే ఉంటానని అన్నారు. రేపటి ఎన్నికల్లో ఏం జరుగుతుందోనని ఈ రోజు ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు వెళ్లలేమని, వీలైనంత మేరకు ప్రజల్లోకి వెళ్లడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.
రాజకీయాల్లో ఏమేం చేయాలో కొన్ని చెప్పకూడదని, చెప్పి చేసేది రాజకీయం కాదని చంద్రబాబు నాయుడు నవ్వుతూ అన్నారు. అరచేతిలో ఏముందో అందరూ ఊహించుకునేలా చేయాలికానీ, చేయి చాచి చూపించకూడదని చెప్పారు. ఎప్పుడు ఏది మాట్లాడాలో ఏమి చేయాలో అది తనకు వదిలిపెట్టాలని అన్నారు. టీటీడీపీ నేతలకు, కార్యకర్తలకు దశ, దిశ సూచించే బాధ్యత తనదేనని అన్నారు.