PM: రూ. 2 వేల నోట్ల ప్రింటింగ్‌ను ఆపేసిన ఆర్‌బీఐ!

  • రూ. 2 వేల  నోటు రద్దు యోచనలో కేంద్రం
  • నోట్ల ప్రింటింగ్‌ను ఆపేసిన ఆర్‌బీఐ
  • సమాచార హక్కు చట్టం కింద విషయం వెలుగులోకి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందా? పెద్ద నోట్లను రద్దు చేసి రూ. 2 వేల నోట్లను తీసుకొచ్చిన కేంద్రం ఇప్పుడు దానిని కూడా రద్దు చేయాలని యోచిస్తోందా? సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వం ఇచ్చిన సమాచారం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

నల్లధనాన్ని సమూలంగా నిర్మూలించే ఉద్దేశంతో గతేడాది నవంబరు 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటించారు. తొలుత ప్రధాని నిర్ణయాన్ని ప్రజలు హర్షించినా క్రమంగా విమర్శలు చెలరేగాయి. దీంతో ఇరకాటంలో పడిన ప్రభుత్వం తప్పు దిద్దుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నట్టు పలు జాతీయ పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. భారతీయ రిజర్వు బ్యాంకు కూడా అటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది.

సమాచార హక్కు చట్టం కింద ఇటీవల ఓ టీవీ చానల్ ఆర్‌బీఐని వివరణ కోరగా ప్రస్తుతం రూ. 2 వేల నోట్ల ముద్రణను ఆపేసినట్టు పేర్కొంది. నోట్ల ముద్రణకు సంబంధించి ఆర్‌బీఐ నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ప్రస్తుతానికైతే రూ. 500, రూ. రూ. 5, రూ. 2 నోట్లను మాత్రమే ముద్రిస్తున్నట్టు బదులిచ్చింది. ఫలితంగా రూ. 2 వేల నోటు రద్దు ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు రూ. 2 వేల నోట్లను ప్రవేశపెట్టి ఏడాదైనా  కాకముందే ఉపసంహరించుకుంటే నోట్ల రద్దు విఫల ప్రయోగమనే వార్తలకు బలం చేకూర్చినట్టు అవుతుందని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకనే రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా అంచనా వేస్తూ సరైన సమయంలో రూ. 2 వేల నోటును రద్దు చేసి తిరిగి రూ. 1000 నోటును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News