NTR: అమ్మకానికి ఎన్టీఆర్ ఇల్లు.. కలత చెందుతున్న అభిమానులు!

  • అనాథగా మారిన ‘అన్న’ గారి ఇల్లు
  • ఇంటి ముందు వేలాడుతున్న బోర్డు
  • నాడు కళకళలాడిన ఇల్లు నేడు కళావిహీనం 

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఒకప్పుడు నివసించిన ఇల్లు ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. చెన్నై, టీ నగర్, బజుల్లా రోడ్డులోని హౌస్ నెంబర్ 28 ఎన్నో మధుర జ్ఞాపకాలకు వేదిక. ఆ నివాసం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. ఆ ఇంటి గేటుకు వేలాడుతున్న ‘ఇల్లు అమ్మబడును’ బోర్డును చూసిన ఎన్టీఆర్ అభిమానులు మనస్తాపం చెందుతున్నారు. గేటుకు వేలాడుతున్న బోర్డులో బ్రోకర్ ఏలుమలై పేరు, సెల్‌ఫోన్ నంబరు ఉన్నాయి.

నటుడిగా ఎన్టీఆర్ కాస్త స్థిరపడిన తర్వాత ముందుగా చెన్నై, రంగరాజపురంలో ఓ చిన్న ఇంటిని కొనుగోలు చేశారు. దీంతో ఆ వీధి కాస్తా ఎన్టీఆర్ వీధిగా మారింది. కొన్నాళ్లకు అలనాటి ప్రముఖ హాస్య నటుడు కస్తూరి శివరావుకు చెందిన బజుల్లా రోడ్డులోని 28వ నెంబర్ ఇల్లు అమ్మకానికి రావడంతో ఎన్టీఆర్ దానిని కొనుగోలు చేశారు. 1953లో కొనుగోలు చేసిన ఈ ఇంటికి కొన్ని మరమ్మతులు చేసి తన అభిరుచికి అనుగుణంగా ఇంట్లోనే కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో తిరుపతికి వచ్చిన తెలుగు వారంతా మద్రాసు ప్రయాణం కూడా పెట్టుకుని, ముందుగా ఎన్టీఆర్ ఇంటికి వచ్చి, ఆయనని చూసి తమ జన్మ ధన్యమైందన్నట్టుగా సంతృప్తి చెంది వెళ్లేవారు.

కాగా, ఎన్టీఆర్ ఈ కొత్త ఇంటికి మారగానే రంగరాజపురంలోని ఇంటిని తన సోదరుడు త్రివిక్రమరావుకు అప్పగించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సహా కుటుంబ సభ్యులంతా హైదరాబాదుకి వచ్చేయడంతో ఇప్పుడు బజుల్లా రోడ్డులోని ఆ ఇల్లు ఆలనా పాలనా లేక కళావిహీనంగా మారింది. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ ఇంటి బయట ఇప్పుడు వేలాడుతున్న 'ఇల్లు అమ్మబడును' అనే ఆ బోర్డు ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది.

  • Loading...

More Telugu News